విశాఖలో విషాదం.. విద్యుదాఘాతానికి గురై బాలుడి మృతి..
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:59 PM
విశాఖ మధురవాడలోని సాయిరామ్ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
విశాఖపట్నం: మధురవాడలోని సాయిరామ్ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విజయనగరం జిల్లా ఉప్పన్నదావలసకు చెందిన కురిటి నారాయణరావు, చిన్నమ్మడు దంపతులు పదేళ్లుగా మధురవాడలో నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె అనుశ్రీ (8), కుమారుడు అఖిల్ (6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం సాయిరామ్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నారాయణరావు వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. దీంతో కుటుంబం మొత్తం అక్కడే నివసిస్తోంది. అయితే, ఈరోజు (ఆదివారం) మధ్యాహ్న సమయంలో అఖిల్ తన స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్ ఎదుట రోడ్డుపై క్రికెట్ ఆడుకుంటున్నాడు. బంతి దూరంగా పడిపోవడంతో దాన్ని తీసుకురావడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనతో సాయిరామ్ కాలనీ వాసులూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నారి మృతి వార్త తెలిసిన వెంటనే ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..