విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు: కూటమి నేతలు
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:59 PM
విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్, కూటమి ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు పరిశీలించారు. ఆర్థిక రాజధాని, సుందర నగరం విశాఖ అని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
విశాఖపట్నం, నవంబర్ 11: విశాఖలో రేపటి నుంచి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 జరగనుంది. ఈ సందర్భంగా సదస్సు ఏర్పాట్లను మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్, కూటమి ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు పరిశీలించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. సీఐఐ సదస్సు వివరాలను వెల్లడించారు. ఆర్థిక రాజధాని, సుందర నగరం విశాఖ అని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుందని.. వరుసగా రెండోసారి ఇదే ప్రాంతంలో సదస్సు జరుగుతోందన్నారు. భారత ఉపరాష్ట్రపతితో పాటు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ సదస్సులో సుమారు రూ.11 లక్ష కోట్లకు ఎంఓయూలు జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈరోజు సాయంత్రం సీఎం చంద్రబాబు విశాఖ వస్తున్నారని.. ఈరోజు జరిగే కొన్ని సమావేశాల్లో సీఎం పాల్గొంటున్నట్లు చెప్పారు. దేశానికి వచ్చే పెట్టుబడులలో రాష్ట్రానికి 25 శాతం పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు.
విశాఖకు అంతర్జాతీయంగా గుర్తింపు: ఎంపీ శ్రీభరత్

విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. 58 దేశాలు నుంచి విదేశీ ప్రతినిధులు, 18 దేశాల నుంచి మంత్రులు సీఐఐ సమ్మిట్‌కు హాజరవుతున్నారని చెప్పారు. ఎమ్‌ఎస్‌ఎమ్ సంస్థలు కొత్త ఆలోచనలతో వస్తున్నాయన్నారు. ఈ సమ్మిట్‌తో విశాఖకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 3,500 మంది ప్రతినిధులు పాల్గొనేలా సీఐఐ సమ్మిట్‌లో ఏర్పాట్లు చేసినట్లు ఎంపీ వెల్లడించారు.
విశాఖలో సీఐఐ సదస్సు గర్వకారణం: ఎమ్మెల్యే విష్ణుకుమార్

31వ సీఐఐ సమ్మిట్ విశాఖలో జరగడం గర్వకారణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. దేశంలో విశాఖ అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రూ.11 లక్షల కోట్లు విలువైన ఎంఓయూలు కుదరనున్నాయని చెప్పారు. దాదాపు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. 58 దేశాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారన్నారు. మూడు పార్టీల కలయికతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 714 ఎంఓయూల ద్వారా రూ.22.60 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఎంఓయూలలో 75 శాతం కార్యరూపం దాల్చాయన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఒక్క భాగస్వామ్య సదస్సును మాత్రమే నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మూడు సార్లు భాగస్వామ్య సదస్సు నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
పెట్టుబడుల నగరంగా విశాఖ: జనసేన ఎమ్మెల్యే
విశాఖలో సీఐఐ సమ్మిట్ జరగడం గర్వకారణమని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గత ఏడాది విశాఖలోనే భాగస్వామ్య సదస్సు విజయవంతంగా జరిగిందని తెలిపారు. విశాఖ పెట్టుబడుల నగరంగా ఎదుగుతోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
నెల్లూరులో భూముల స్కాం.. మేకపాటి రాజగోపాల్‌పై కేసు నమోదు
ఏపీకి రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు.. 24 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: ఎంపీ విజయ్
Read Latest AP News And Telugu News