ఏనుగులు, ప్రజల ప్రాణాల రక్షణ.. ప్రభుత్వాల బాధ్యత: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:59 PM
ఏనుగుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పర్యావరణ సహాయక శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. మానవ-ఏనుగు మధ్య ఘర్షణలు తీవ్రమైన సమస్యగా మారాయన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 13: ఏనుగుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పర్యావరణ సహాయక శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. మానవ-ఏనుగు మధ్య ఘర్షణలు తీవ్రమైన సమస్యగా మారాయన్నారు. దీనికి తాత్కాలిక చర్యలకంటే శాస్త్రీయ పరిశోధన ఆధారిత సమగ్ర ప్రణాళిక అవసరమని తెలిపారు. ఏనుగుల సంరక్షణలో పురోగతి సాధించినప్పటికీ పంట నష్టం, ప్రాణనష్టం, అలాగే ఏనుగుల మృతి వంటి ఘటనలు పెరుగుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ఏనుగు సంరక్షణ ప్రణాళికను రూపొందించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంపొందిస్తూ బందీ ఏనుగుల డీఎన్‌ఏ డేటాబేస్‌తో పాటు ఏనుగుల కదలికలను పర్యవేక్షించే ‘గజ సూచన’ యాప్‌ను వినియోగిస్తున్నామని తెలిపారు. ఘర్షణలను తగ్గించడంలో ఏనుగుల ప్రవర్తనపై అధ్యయనానికి ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
రైల్వే మార్గాల వద్ద చర్యలు
ఏనుగుల మృతిని నివారించేందుకు రైల్వే శాఖతో సమన్వయంగా ప్రమాదకర ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఫెన్సింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. విద్యుత్ లైన్ల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు కూడా అవసరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో మూడు కొత్త ఏనుగు రిజర్వులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘర్షణలకు ఒకే విధమైన పరిష్కారం ఉండదని, ప్రాంతాలవారీగా కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక చర్యలకు పరిమితం కాకుండా ముందస్తు అంచనా ఆధారిత వ్యవస్థ అవసరమని చెప్పుకొచ్చారు.
పరిశోధన ఆధారిత చర్యలు
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ప్రమాద ప్రాంతాలను గుర్తిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రాల మధ్య అనుభవాలను పంచుకోవడం ద్వారా మరింత సమర్థవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయన్నారు. ఏనుగుల సంరక్షణ, ఘర్షణల నివారణ కోసం రూ.500 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధుల ద్వారా శాస్త్రీయ చర్యలను విస్తృత స్థాయిలో అమలు చేయవచ్చన్నారు. ఏనుగులు, ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణ ప్రభుత్వాల బాధ్యత అని, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతోనే దీర్ఘకాలిక పరిష్కారాలు సాధ్యమవుతాయని కేంద్ర పర్యావరణ సహాయక శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం
సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత
Read Latest AP News And Telugu News