Share News

ఆస్ట్రేలియాలో ప్రమాదం.. అత్తాకోడళ్ళ దుర్మరణం

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:16 AM

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన అత్తాకోడళ్లు మృతిచెందారు. భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన అత్త.. మరో పది రోజుల్తో తిరిగి ఇండియాకు రావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియాలో ప్రమాదం.. అత్తాకోడళ్ళ దుర్మరణం

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన అత్తాకోడళ్లు మృతిచెందారు. భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన అత్త.. మరో పది రోజుల్తో తిరిగి ఇండియాకు రావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలివీ.. స్థానిక సీతమ్మధారకు చెందిన జీటీ ప్రసాద్‌ కుమారుడు అరుణ్‌ మెల్‌బోర్న్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అరుణ్‌, భార్య నేహా (34), ఇద్దరు పిల్లలతో అక్కడే స్థిరపడ్డారు. మెల్‌బోర్న్‌లో ఉంటున్న బంధువుల్లో ఒకరి ఇంట శుభకార్యం ఉండడంతో జీటీ ప్రసాద్‌.. భార్య రమాదేవి(67)తో కలిసి నెల కిందట అక్కడికి వెళ్లారు. మరో పది రోజుల్లో ఇద్దరూ తిరిగి రావాల్సి ఉంది. ఈ క్రమంలో బుధవారం జీటీ ప్రసాద్‌ దంపతులతోపాటు కుమారుడి కుటుంబం, బంధువైన మరో మహిళ కలిసి రెండు కార్లలో సందర్శనీయ స్థలాలకు బయలుదేరారు. ప్రసాద్‌, ఆయన కుమారుడు అరుణ్‌, మనవడు, మనవరాలు ఒక కారులో ఉండగా, రమాదేవి, నేహా, మరో మహిళ మరో కారులో ఉన్నారు. ముందువెళుతున్న రమాదేవి, నేహా ఉన్న కారు ఒక సిగ్నల్‌ వద్ద ఎడమ వైపు తిరుగుతుండగా, మరొక వైపు నుంచి ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న రమాదేవి, నేహా అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. తమ కళ్లముందే తమవారిని కోల్పోవడంతో వెనుక కారులో ఉన్న ప్రసాద్‌, అరుణ్‌ షాక్‌కు గురయ్యారు. ప్రమాద విషయ తెలియగా విశాఖలోని వారి స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రసాద్‌ గతంలో విశాఖ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌లో కీలకంగా పనిచేశారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 06:16 AM