ఏనుగుల కోసం కారిడార్‌లు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:16 AM
ఏనుగులు ఒక అడవి నుంచి మరో అడవిలోకి వెళ్లేందుకు వీలుగా దేశవ్యాప్తంగా క్రాసింగ్ జోన్‌లు, కారిడార్‌లు ఏర్పాటు చేయాలని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఐ) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బిలాల్ హబీబ్ పేర్కొన్నారు.
డబ్ల్యూడబ్ల్యూఐ సీనియర్ శాస్త్రవేత్త బిలాల్ హబీబ్
విశాఖపట్నం: ఏనుగులు ఒక అడవి నుంచి మరో అడవిలోకి వెళ్లేందుకు వీలుగా దేశవ్యాప్తంగా క్రాసింగ్ జోన్‌లు, కారిడార్‌లు ఏర్పాటు చేయాలని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఐ) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బిలాల్ హబీబ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విశాఖ నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ‘మానవ-ఏనుగు సంఘర్షణ, భారతదేశంలో జరుగుతున్న దృశ్యాలు’ అనే అంశంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగుల వల్ల జరిగే నష్టాన్ని నివారించేందుకు అనేక ప్రాంతాల్లో ఎలక్ర్టిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల ఏనుగులు మరణిస్తున్నాయని చెప్పారు. అందువల్ల వాటిని తొలగించాలన్నారు.
ఒక అడవి నుంచి మరో అడవిలోకి వెళ్లే క్రమంలో ఏనుగులు ప్రమాదాలకు గురవుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక కారిడార్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రమేశ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. దేశంలో 127 రైలు మార్గాల్లో ఏనుగులు, పులుల సంచారం ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
13 రాష్ట్రాల్లో విస్తరించిన 77 అత్యంత ప్రమాదకరమైన మార్గాల్లో 705 ఓవర్ పాస్‌లు, ఫెన్సింగ్, అండర్‌పాస్‌లు, ర్యాంప్‌లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఐ ఎలిఫెంట్ సెల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పరాగ్ నిగమ్, డబ్ల్యూడబ్ల్యూఐ శాస్త్రవేత్త డాక్టర్ విష్ణు ప్రియ కొల్లిపాకం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, పశువైద్య నిపుణులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.