ఏపీ అభివృద్ధి చెందితే భారత్ అభివృద్ధి చెందుతుంది: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Jun 05 , 2026 | 03:42 PM
భారతదేశంలో సముద్రపు ఆహారం (సీ-ఫుడ్) ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఏపీ నుంచి ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు.
విశాఖ: భారతదేశంలో సముద్రపు ఆహారం (సీ-ఫుడ్) ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఏపీ నుంచి ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. ఏపీలో బ్లూ ఎకానమీ పెరిగితే దేశ ప్రగతికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విశాఖలో సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టును ఆధునికీకరణ చేస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మత్స్యశాఖ ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 'భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతంగా, రొయ్యల ఉత్పత్తిలో 66 శాతంగా ఉంది. దేశ సముద్రపు ఆహార ఎగుమతుల్లో ఏపీ నుంచే కేంద్రానికి దాదాపు 38 శాతం ఆదాయం వస్తోంది. సంవత్సరానికి రూ.28,000 కోట్లకు పైగా సీ-ఫుడ్ ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులూ అభివృద్ధి చెందుతాయి. ఆక్వా రంగంలో ఏపీ ఆవిష్కరణలు చేస్తే భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ముందుకు సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్‌లో భారత్ వాటా కేవలం 5 శాతం మాత్రమే. ఈ రంగంలో దేశానికి పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యం. నీరు ఉన్న చోట నాగరికతలు విలసిల్లుతాయి. ఏపీలో గోదావరి, కృష్ణ వంటి జీవనదులు ఉన్నాయి. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే' అని పేర్కొన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ బీద మస్తాన్ రావు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి: ఏపీ డిప్యూటీ సీఎం
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు..?