Share News

విశాఖ సర్వే డీడీపై బదిలీ వేటు

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:52 AM

విశాఖ జిల్లా ఎండాడ భూమి వ్యవహారంపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరాధీనం చేసేందుకు ప్రయత్నించిన కేసులో సర్వే, సెటిల్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రమణమూర్తిపై రెవెన్యూ శాఖ బదిలీ వేటు వేసింది.

విశాఖ సర్వే డీడీపై బదిలీ వేటు

  • సామర్లకోటలో అదనపు డైరెక్టర్‌గా పోస్టింగ్‌

  • రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదరి ఉత్తర్వులు

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా ఎండాడ భూమి వ్యవహారంపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరాధీనం చేసేందుకు ప్రయత్నించిన కేసులో సర్వే, సెటిల్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రమణమూర్తిపై రెవెన్యూ శాఖ బదిలీ వేటు వేసింది. సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ రోణంకి కూర్మనాథ్‌ సిఫారసుల మేరకు ఆయనకు సామర్లకోటలో ఉన్న సర్వే అకాడమీలో అదన పు డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వు (జీవో 1851) జారీ చేశారు. రమణమూర్తిపై తీవ్రమైన అభియోగాలు నమోదు చేసినా ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని, ఆయన్ను విశాఖ వంటి కీలక జిల్లా నుంచి తప్పించకపోవడం వెనుక పెద్దల మద్దతు ఉందని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ‘ఎండాడ భూమి కేసులో ప్రైవేటుకు కొమ్ముకాశారు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 6న కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పిస్తూ తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వే కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.


ఇదీ నేపథ్యం

ఎండాడలోని సర్వే నం.13లో ఐదు సబ్‌ డివిజన్ల కింద 14.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో సర్వే నం. 13-4లో ఉన్నది 59 సెంట్లు మాత్రమే. అయితే ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయిన సర్వే అధికారులు అక్కడ 4.60 ఎకరాలు ఉన్నట్లు నివేదికలు తయారు చేశారు. ఈ విధంగా సృష్టించిన భూమిని ఫిజికల్‌గా చూపించడానికి గాను సర్వే నం.13-2లో ఏపీ హౌసింగ్‌ బోర్డుకు ఉన్న 5.10 ఎకరాల నుంచి కొంత భూమిని దానిలోకి మార్చేశారు. దీనికి తగినట్లుగా అధికారులు భూముల సర్వేచేసి నివేదిక రూపొందించారు. ఈ 4.60 ఎకరాల విలువ నికరంగా రూ.100 కోట్ల పైమాటే. విశాఖకే చెందిన ఓ కీలక నేత, మాజీ మంత్రి కోసమే ఇదంతా చేశారన్న ప్రచారం జరిగింది. ఈ అంశంపై ‘విశాఖలో 600 కోట్ల భూమికి స్కెచ్చేశారు’ శీర్షికతో జూలై 4న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన వార్తను ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు జిల్లా సర్వే డీడీని అమరావతిలోని కమిషనరేట్‌కు సరెండర్‌ చేశారు. అయితే, తెర వెనుక పెద్దల జోక్యంతో సదరు అధికారిని తిరిగి విశాఖకే పంపించారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 04:52 AM