Share News

పేదల సొంతింటి కల సాకారం

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:46 AM

పేదల సొంతింటి కల సాకారం కానుంది. ఇళ్లపై హక్కుల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న 28,445 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు శనివారం పట్టాలు పంపిణీ చేయనున్నారు. విశాఖపట్నం జిల్లాలోని...

పేదల సొంతింటి కల సాకారం

  • చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా విశాఖపట్నం

  • విశాఖ జిల్లాలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చ.గ. స్థలాల క్రమబద్ధీకరణ

  • నేడు 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం

  • ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో కార్యక్రమం

అమరావతి/ విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల సాకారం కానుంది. ఇళ్లపై హక్కుల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న 28,445 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు శనివారం పట్టాలు పంపిణీ చేయనున్నారు. విశాఖపట్నం జిల్లాలోని 11 మండలాల్లో 399 ఎకరాల పరిధిలో 19,33,853 చదరపు గజాల ప్రభుత్వ స్థలాల్లో ఈ కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాయి. దాదాపు రూ.8,874 కోట్ల విలువైన ఈ భూములను పేదలకు క్రమబద్ధీకరించి, ఇంత పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినప్పుడు.. అభ్యంతరాల్లేని చోట్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో విశాఖ జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించనున్నారు. విశాఖ రూరల్‌లో అత్యధికంగా 9,261 కుటుంబాలు, ములగాడలో 4,213, గాజువాకలో 4,353, గోపాలపట్నంలో 3,253, పెందుర్తిలో 2,722, పెదగంట్యాడలో 1,910, మహారాణిపేటలో 1,235, సీతమ్మధారలో 668, భీమిలిలో 464, ఆనందపురంలో 349, పద్మనాభంలో 17 చొప్పున కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 2017-2019 మధ్య సుమారు 22వేల మందికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పట్టాలు పంపిణీ చేశారు. వారికి రెండేళ్ల తరువాత పూర్తి హక్కులు లభించేలా కన్వేయన్స్‌ డీడ్లు జారీచేయాల్సి ఉండగా 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అంశంపై సీఎం దృష్టిసారించారు. శనివారం మధ్యాహ్నం 2గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో సీఎం చేతుల మీదుగా కన్వేయన్స్‌ డీడ్లు, పట్టాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.


నేడు విశాఖకు వస్తున్నా: చంద్రబాబు

‘తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబం కల. అలాంటి వేలమంది కలను నిజం చేసేందుకు నేడు (శనివారం) విశాఖకు వస్తున్నా! దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది. తమ ఇంటిపై హక్కు పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది’ అని సీఎం చంద్రబాబు శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని, ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరించి, పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. ఇది కేవలం పట్టాల పంపిణీ కాదు. 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది. భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది. బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది. ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో... సామాన్య కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాం. వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 03:46 AM