విశాఖకు అనుబంధంగా బే-టెక్ సిటీ
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:46 AM
విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ ప్రణాళికలో భాగంగా యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి ‘విశాఖ బే-టెక్ సిటీ’ అని పేరు పెట్టారు.
పేరు ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
హైదరాబాద్‌లో సైబరాబాద్‌లా అభివృద్ధి
రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు ల్యాండ్‌బ్యాంక్
పోర్టు ఆధారిత పరిశ్రమలతో ఏపీ అభివృద్ధి
గ్లోబల్ సెమీ కండక్టర్ డిజైన్ కేంద్రంగా తిరుపతి
ఆ రీజియన్‌లో పారిశ్రామిక నగరాలుగా 16 పట్టణాలు
క్వాంటమ్‌తో అమరావతి రీజియన్‌లో పెట్టుబడులు
సూర్యలంక, గండికోటలకు టూరిజం మాస్టర్‌ప్లాన్
భారీ ప్రాజెక్టులకు ఎంఎస్ఎంఈలు అనుసంధానం
విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లపై సమీక్షలో అధికారులకు సీఎం దిశానిర్దేశం
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ ప్రణాళికలో భాగంగా యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి ‘విశాఖ బే-టెక్ సిటీ’ అని పేరు పెట్టారు. వివిధ పేర్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పేరును ఖరారు చేశారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ పేరుతో నగరాన్ని అభివృద్ధి చేసినట్టుగానే బే-టెక్ సిటీ పేరుతో విశాఖకు అనుబంధంగా మరో నగరాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూపొందించిన విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల విషయంలో అధికారులు రూపొందించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి గురువారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేశారు. ఈ ప్రణాళికలు అభివృద్ధికి బ్లూప్రింట్ వంటివని ముఖ్యమంత్రి అన్నారు. మూడు ఆర్థిక ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 3 రీజియన్లలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సిటీ ఎకనమిక్ రీజియన్ స్కీం కింద 60 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 9,180 కోట్లతో సిద్ధంచేసిన ప్రతిపాదనలను కార్యరూపం దాల్చేలా చూడాలని ఆదేశించారు.
ల్యాండ్ బ్యాంక్ పాలసీ తేవాలి
విశాఖ ఎకనమిక్ రీజియన్ స్టీరింగ్ కమిటీలో నగర మేయర్‌కు చోటు కల్పించాలని సీఎం సూచించారు. ఈ రీజియన్ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించి 167 ప్రాజెక్టులకు గానూ 64 ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయని సీఎం వివరించారు. విశాఖకు చెరోవైపు ఉన్న విజయనగరం, అనకాపల్లి వైపు అభివృద్ధి జరుగుతోందని ఆ ప్రాంతాల్లో అవసరమైన మేరకు ముందుగానే భూమిని గుర్తించి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేుసుకోవాలని సూచించారు. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూ లభ్యత తక్కువగా ఉంటుందని, ఇలాంటిచోట ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.
దీనికోసం అవసరమైతే పాలసీ తీసుకురావాలని సూచించారు. విశాఖలో ఏడాదిలోగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పోర్టుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు విస్తృత అవకాశాలున్నాయని, పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానాన్ని మెరుగుపరిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో 16పట్టణాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. మూడు ఆర్థిక ప్రాంతాలకు ప్రముఖ విద్యాసంస్థలను నాలెడ్జ్ పార్టనర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని సాంకేతిక, పారిశ్రామిక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు.
తిరుపతిని గ్లోబల్ సెమీ కండక్టర్ల డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. 3 ఆర్థిక ప్రాంతాల్లో ప్రధాన పరిశ్రమలతో పాటు వాటికి అవసరమైన విడిభాగాలు, సేవలు అందించే ఎంఎస్ఎంఈలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. గ్రీన్ ఎనర్జీ, హర్టికల్చర్, ఖనిజ ఆధారంగా తిరుపతి ప్రాంతంలో కొత్త పెట్టుబడులకు అవకాశాలున్నాయని చెప్పారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో మొత్తం రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే రూ. 5.70 లక్షల కోట్లు గ్రీన్ ఎనర్జీ రంగంలోనే వచ్చాయని సీఎం చెప్పారు.
అమరావతిలో అభివృద్ధి కేంద్రాలుగా రింగ్‌రోడ్లు
అమరావతి ఎకనమిక్ రీజియన్లో ఆక్వా, కోకో, పామాయిల్ వంటి రంగాలు అతిపెద్ద ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే రూ. 4.65 లక్షల కోట్ల విలువైన 48 ప్రాజెక్టుల పనులు అమల్లో ఉన్నాయని చెప్పారు.
మచిలీపట్నం, రామాయపట్నం వంటి పోర్టులకు మంచి కనెక్టివిటీ అందిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, క్వాంటమ్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి రీజియన్ పరిధిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉందన్నారు. అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్, అవుటర్ రింగ్‌రోడ్ నిర్మాణాలు అభివృద్ధికి కేంద్రంగా ఉంటాయని పేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతాల్లో వసతులు కల్పించాలి
అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించేలా రహదారులు, వసతి, ఇతర మౌలికసదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే సీఐఐ సదస్సు నాటికి ఆహ్వానితులను అరకు, లంబసింగి వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాలని సూచించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుతూ బీచ్ రిసార్టులుగా అభివృద్ధి చేయాలన్నారు.
సూర్యలంక, ఓడరేవు, చినగంజాం, నిజాంపట్నం, దిండి వంటి ప్రాంతాల్లో బీచ్, ఎకో టూరిజాన్ని అభివ్ధధ చేయాలన్నారు. నాగార్జున కొండ, అమరావతి ప్రాంతాలను అనుసంధానిస్తూ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. సూర్యలంక, గండికోట ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ