విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్!
ABN , Publish Date - Oct 21 , 2026 | 04:48 PM
హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారు స్మగ్లింగ్ ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లింగ్ ముఠా బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం తరలిస్తుండగా అధికారులు భగ్నం చేశారు.
విజయవాడ, అక్టోబర్ 21: హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారు స్మగ్లింగ్ ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పట్టుకున్నారు. స్మగ్లింగ్ ముఠా బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం తరలిస్తుండగా అధికారులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 3.1 కేజీల బంగారం, భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఆపరేషన్‌ను డీఆర్ఎఐ హైదరాబాద్ జోనల్, విజయవాడ రీజనల్ అధికారులు సంయుక్తంగా చేపట్టారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ స్కార్పియో వాహనాన్ని విజయవాడ శివారులో అధికారులు తనిఖీ చేశారు. వాహనంలో ప్రత్యేకంగా తయారుచేసిన రహస్య బాక్స్‌లో విదేశీ కరెన్సీని గుర్తించారు. ఈ కరెన్సీ అక్రమ బంగార విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మేనని నిందితులు విచారణలో అంగీకరించారు.
నిందితులు ఇచ్చిన సమచారంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ బస్సును టోల్ ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు అడ్డగించారు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితులను సోదా చేయగా.. వారి నడుములకు ప్రత్యేకంగా కట్టిన పౌచ్‌లలో 3,147.1 గ్రాముల బరువున్న మూడు బంగారు బిస్కెట్లు లభించాయి. అలాగే వారి వద్ద నుంచి 60,000 అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీ మొత్తం విలువ రూ. 5.84 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ స్మగ్లింగ్ ముఠాలో కీలక ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలతో వీరికి ఉన్న సంబంధాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి..