విజయవాడలో దసరా పూజా టికెట్ల కలకలం.. భక్తులకు దేవస్థానం కీలక హెచ్చరిక
ABN , Publish Date - Sep 19 , 2026 | 09:47 PM
దసరా నవరాత్రుల సందడి మొదలయ్యేలోపే విజయవాడలో నకిలీ పూజా టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. దేవస్థానం అధికారికంగా టికెట్ల విక్రయాలు ప్రారంభించకముందే ‘శ్రీ చక్రార్చన’ పేరుతో టికెట్లు చేతులు మారినట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
విజయవాడ, సెప్టెంబర్ 19: నగరంలో రాబోయే దసరా మహోత్సవాలు–2026ను ఆసరాగా చేసుకుని నకిలీ పూజా టికెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు దేవస్థానం గుర్తించింది. ఈ వ్యవహారంపై దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ నగర పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న కావలికి చెందిన ఓ మహిళా భక్తురాలు అక్టోబర్ 18, 2026 తేదీకి రూ.3,500 విలువైన ఆఫ్‌లైన్ ‘శ్రీ చక్రార్చన’ టికెట్ కొనుగోలు చేసినట్లు దేవస్థానానికి సమాచారం అందించారు.
టికెట్‌పై అనుమానం రావడంతో ఆమె దేవస్థానం ఐటీ విభాగాన్ని సంప్రదించగా.. దసరా ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఆన్‌లైన్ కోటాను ఇంకా విడుదల చేయలేదని.. ఆఫ్‌లైన్ టికెట్ విక్రయాలు కూడా ప్రారంభించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ టికెట్‌ను ఓ పరిచయస్తుడి ద్వారా ఆలయ ప్రాంగణంలో ఉండే ‘శర్మ’ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు భక్తురాలు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. పాత పూజా టికెట్‌పై తేదీ.. ఇతర వివరాలను మార్చి కొత్త టికెట్‌లా తయారు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
దేవస్థానంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు, పూజలు, దర్శన టికెట్లు పారదర్శకమైన అధికారిక ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దసరా మహోత్సవాల్లో నిర్వహించే కుంకుమార్చనలు, శ్రీ చక్రార్చన, చండీ హోమం తదితర ప్రత్యేక పూజలకు సంబంధించిన టికెట్ కోటాను దేవస్థానం ఇంకా విడుదల చేయలేదని ఈఓ నాయక్ తెలిపారు. టికెట్ కోటా విడుదల తేదీలను ముందుగానే మీడియా ద్వారా భక్తులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. భక్తులు దేవస్థానం అధికారిక వెబ్‌సైట్, ‘వాట్సాప్ మన మిత్ర’ లేదా దేవస్థానం నిర్దేశించిన కౌంటర్లలో మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. బయట వ్యక్తులు, దళారులు, అనధికారిక వ్యక్తుల వద్ద పూజా లేదా దర్శన టికెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరించారు. దేవస్థానం పేరుతో ఎవరైనా టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆలయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఈఓ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News