కొట్టి చంపేశారు!
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:41 AM
విజయవాడ నగరంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని చేతులు వెనక్కి విరిచి, విద్యుత్ స్తంభానికి కట్టేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇంతటి దారుణ ఘటనకు కారణం..
విజయవాడ నగరంలో యువకుడి దారుణ హత్య
దొంగతనానికి ప్రయత్నించాడనే అనుమానంతో.. విద్యుత్ స్తంభానికి కట్టేసి.. చిత్రహింసలు
విజయవాడ (ఎన్టీఆర్ సర్కిల్), అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని చేతులు వెనక్కి విరిచి, విద్యుత్ స్తంభానికి కట్టేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇంతటి దారుణ ఘటనకు కారణం.. అతడు దొంగతనానికి ప్రయత్నించాడనే అనుమానమే. నగరంలోని పటమట డొంకరోడ్డులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణలోని నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33) కొంతకాలంగా విజయవాడలో ఉంటున్నాడు. అతడు ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో పటమట డొంకరోడ్డులోని ఓ పాన్‌షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ తాళం వేసి ఉన్న ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అటుగా వచ్చిన పాల వ్యాన్ డ్రైవర్ దీనిని గమనించి, పాన్‌షాప్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడు.
పాన్‌షాప్‌లో పనిచేసే రవిశంకర్ అక్కడికి చేరుకుని.. వాటర్ బాటిల్ తీయడానికి ప్రయత్నించిన సాయికుమార్‌ను మద్యంషాపు వెనక సందులోకి ఈడ్చుకెళ్లాడు. అక్కడ కాక్టెయిల్ బార్‌లో పనిచేసే అయ్యప్ప కూడా తోడవడంతో ఇద్దరూ కలిసి సాయికుమార్ చేతులను వెనక్కి విరిచి విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టడం ప్రారంభించారు.
ఇది చూసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ విషయం తెలుసుకుని, వారికి తోడయ్యారు. నలుగురూ కలిసి సుమారు రెండు గంటలసేపు దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడినసాయికుమార్ అక్కడిక్కడే చనిపోయాడు. ఉదయం 6 గంటల సమయంలో వైన్ షాపు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న నాగేశ్వరరావు అక్కడికి వెళ్లారు. రక్తపు గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని చూసి పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తిగా అనుమానించి, అతడిని సాయికుమార్ గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. పటమట పోలీసులు నలుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి..