Share News

విజయవాడ ఆటోనగర్‌లో టాయ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:44 PM

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. పిల్లల బొమ్మలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించాయి.

విజయవాడ ఆటోనగర్‌లో టాయ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం
Vijayawada fire accident

విజయవాడ, నవంబరు 21: నగరంలోని ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ మూడో క్రాస్ రోడ్, రోడ్ నంబర్ 2లో ఉన్న టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు యూనిట్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని మొదటి.. రెండో అంతస్తులు పూర్తిగా మంటలకు ఆహుతైనట్లు సమాచారం. యూనిట్‌లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన పిల్లలకు సంబంధించిన బొమ్మలు, తయారీ సామగ్రి, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


సుమారు ఐదు కోట్ల ఆస్తి నష్టం.. ఆరు దేశాలకు ఎగుమతులు..

ఈ అగ్నిప్రమాదంపై ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ.. ఆటోనగర్ మూడో క్రాస్ రోడ్, రోడ్ నంబర్ 2లోని టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఐదు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని యూనిట్ నిర్వాహకులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదంలో కొన్ని కీలక రికార్డులు సైతం కాలిపోవడంతో వాస్తవంగా ఎంత మేర నష్టం వాటిల్లిందన్నది ఇంకా పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. ఈ యూనిట్‌లో తయారయ్యే పిల్లలకు సంబంధించిన బొమ్మలు, ఇతర ఉత్పత్తులను సుమారు ఆరు దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 02:58 PM