బాల్ ఠాక్రేలా వ్యవహరిస్తా
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:16 AM
బాల్ ఠాక్రేలా వ్యవహరించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తాను సీఎం రేసులో ఉండనని చెప్పారు. శుక్రవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తా
మా పార్టీ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని కాపాడుతుంది
అధికారంలోకి వస్తే రతనాల సీమ చేస్తాం: విజయసాయి
అనంతపురం కలెక్టరేట్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): బాల్ ఠాక్రేలా వ్యవహరించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తాను సీఎం రేసులో ఉండనని చెప్పారు. శుక్రవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. తాము పెట్టబోయే పార్టీ రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని కాపాడుతుందని అన్నారు. తమ పార్టీ అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని కులాల కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, అయితే కూటమి ప్రభుత్వంలో రెడ్డి కార్పొరేషన్ పదవులను భర్తీ చేయలేదని పేర్కొన్నారు. వాటిని కూడా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయాక 12ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రెండు కుటుంబాలు రాయలసీమకు ఏం చేశాయని విజయసాయి ప్రశ్నించారు. 2014 నుంచి మూడుసార్లు ఎన్నికలు జరిగితే చంద్రబాబు, జగన్ ముఖ్యమంత్రులు అయ్యారని, వారిద్దరూ రాయలసీమకు చెందినవారేనని చెప్పారు. ఈ ఇద్దరు సీఎంల పాలనలో కొత్తగా ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి, రాయలసీమ కేంద్రంగా ఏదైనా అభివృద్ధి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. సీమపై ఆ రెండు కుటుంబాలకు ప్రేమ లేదని విమర్శించారు. ఆ ఇద్దరి కోసం ఉద్యమాలు చేస్తాం, రక్తం ధారపోస్తామని చెప్పేవాళ్లు ఉన్నారని, వ్యక్తి ఆరాధన కాకుండా సీమ అభివృద్ధి కోసం రక్తం చిందించాలని యువతను కోరారు. శ్రీబాగ్ ఒడంబడిక ఏమైందని ప్రశ్నించారు. కృష్ణా, తుంగభద్ర, పెన్నా జలాలను ఉపయోగించి సీమను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని, నీటి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. ఈ ప్రాంతం నుంచి సీఎంలుగా పనిచేసిన వారి కుటుంబాలు బాగుపడ్డాయా..? లేక సీమ ప్రజలు బాగుపడ్డారా..? అని ఆయన నిలదీశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే సీమకు సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తామని, కడుపు మండిన సీమ యువతతో కలిసి పనిచేసి, రతనాల సీమగా మరుస్తామని విజయసాయి హామీ ఇచ్చారు. కడపలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు డిమాండ్‌ను పరిశీలిస్తామని చెప్పారు. 2029 ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే లోకేశ్ సీఎం అవుతారని, వైసీపీకి ఓటేస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తాము పెట్టబోయే పార్టీకి ఓటేస్తే కడుపు మండిన యువతలో, దేశభక్తి కలిగి, ఏ కులమైనా, మతమైనా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్లు, కమ్మ, క్షత్రియ, కాపు, బ్రాహ్మణ ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. రాజ్యాంగంలోని 15, 19 అధికరణల్లో పొందుపరిచిన విధంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని పేర్కొన్నారు. గంజాయిని నియంత్రిస్తామని, ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తాను కులాలకు, మతాలకు వ్యతిరేకిని కాదని, మతమార్పిడికి వ్యతిరేకమని తెలిపారు. తమ పార్టీలో యువతకు 66శాతం అవకాశం ఇస్తానని తమది అభ్యుదయ పార్టీ అని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేద్దామని, అందరూ కలసి రావాలని విజయసాయి పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి...