Share News

ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:15 AM

ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్‌.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్‌

  • పార్టీకి, విజయనగరం జడ్పీ చైర్మన్‌ పదవికి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా

  • కుమార్తెతో కలిసి అమరావతిలో సీఎంతో భేటీ

  • కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు

  • ఇంటిపోరు రచ్చకెక్కి పార్టీ మార్పు..

  • బొత్స కుమార్తెను జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో మనస్తాపం?

విజయనగరం/అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్‌.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా కూడా ఉన్న ఆయన.. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి, పార్టీ పదవులకూ రాజీనామా చేయడమే గాక.. వెంటనే అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన కుమార్తెతో పాటు టీడీపీలో చేరడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. 26 ఏళ్ల రాజకీయ చరిత్రలో చిన్న శ్రీను తన మేనమామ బొత్స వద్దే శిష్యరికం చేశారు. ఆయన తర్వాత తానే మంత్రి అన్న తీరుగా వ్యవహరించారు. బొత్స కుటుంబం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు చిన్నశ్రీనును అందరూ షాడో నేతగా భావించేవారు. పార్టీలో ఎటువంటి పదవీ లేకున్నా అధికార కేంద్రంగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో బొత్స కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంది. 2018లో జగన్‌ ఆహ్వానంతో వైసీపీలో చేరింది. జగన్‌ పాదయాత్రలో చిన్నశ్రీను ఉత్తరాంధ్రలో అన్నీతానై వ్యవహరించారు. 2021 జడ్పీ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో ఆయన చైర్మన్‌గా నియమితులయ్యారు. చిన్న శ్రీను చేపట్టిన తొలి అధికారిక పదవి ఇదే. ఈ నెల 24తో పదవీకాలం ముగియనుంది. బుధవారం జడ్పీ సమావేశం ఉందనగా ఆయన రాజీనామా చేయడం విశేషం. బొత్సతో విభేదించి ఆయనీ నిర్ణయం తీసుకున్నారా.. లేకుంటే ఆయన కంటే ముందే వైసీపీ నుంచి బయటకు రావాలని భావించారా అనేది తెలియరాలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా బొత్స కుటుంబం మొత్తం వైసీపీకి గుడ్‌బై చెబుతుందన్న ప్రచారం నడుస్తోంది. ఆయన దీనిని ఖండించకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతలోనే చిన్నశ్రీను టీడీపీలో చేరి ట్విస్టు ఇచ్చారు.


కుమార్తె కోసమే నిర్ణయం?

ఇంకోవైపు.. వైసీపీకి చిన్న శ్రీను గుడ్‌బై చెప్పడానికి తగిన కారణమే ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇటీవల బొత్స తన కుమార్తె అనూష విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో ఉంటారని ప్రకటించారు. అయితే అప్పటికే ఈ పదవికి తన కుమార్తె సిరిసహస్రను నిలబెట్టాలని నిర్ణయించుకున్న చిన్నశ్రీను.. తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా బొత్స ప్రకటించే సరికి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. అందుకే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బలంగా ఉన్న బొత్స కుటుంబంలో చీలిక వచ్చిందన్న ప్రచారం జిల్లాలో కొంత బలంగానే ఉంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో 2019లో బడ్డుకొండ అప్పలనాయుడు గెలిచారు. ఈయన చిన్నశ్రీనుకు స్వయానా సోదరి భర్త. కానీ నియోజకవర్గంలో బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు జోక్యం చేసుకునేవారు. 2024 ఎన్నికలకు ముందు ఇక్కడ వైసీపీ టికెట్‌ విషయంలో పంచాయితీ నడిచింది. లక్ష్మణరావు కోసం బొత్స ప్రయత్నించినప్పటికీ అప్పలనాయుడికే మళ్లీ దక్కింది. దీంతో లక్ష్మణరావు పరోక్షంగా అప్పలనాయుడి ఓటమికి కృషిచేశారనే ప్రచారం జరిగింది.


ముహూర్తం కుదిరింది.. రంగుమారింది!

చిన్నశ్రీను రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో చర్చించిన అనంతరం టీడీపీలో చేరారు. ఆయనతోపాటు ఆయన కుమార్తె సిరిసహస్రకూ చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, మాజీ మంత్రులు కళావెంకట్రావు, కొండ్రు మురళి, సుజయ్‌కృష్ణ రంగారావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎమ్మెల్యేలు కోళ్లలలిత కుమారి, అదితి, బేబినాయన తదితరులు పాల్గొన్నారు. చిన్న శ్రీనును టీడీపీలోకి తీసుకురావడంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ క్రియాశీల పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మంగళవారం తర్వాత మంచిరోజులు లేవన్న ఉద్దేశంతోనే చిన్నశ్రీను, సిరిసహస్ర వైసీపీని వీడి హడావుడిగా టీడీపీలో చేరినట్లు సమాచారం. వీరిద్దరూ ఉండవల్లిలో టీడీపీలో చేరుతున్న సమయంలోనే.. విజయనగరం ధర్మపురిలోని చిన్నశ్రీను స్వగృహం వద్ద కార్యకర్తలు వైసీపీ ఫ్లెక్సీలు తొలగించడం గమనార్హం.

బొత్సతో విభేదాల్లేవు: చిన్నశ్రీను

చంద్రబాబు పాలన నచ్చడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామినయ్యేందుకు, తాను టీడీపీలో చేరానని చిన్న శ్రీను అన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మరింత అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తాను చంద్రబాబు, యువనేత లోకేశ్‌ పాలనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బొత్స సత్యనారాయణతో తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు. ఒక కార్యకర్తగా టీడీపీలో చేరానని.. పదవుల కోసం కాదని చెప్పారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన రాకను టీడీపీ నాయకులు కూడా స్వాగతించారని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

పడక గది ప్రశాంతంగా...

Updated Date - Sep 09 , 2026 | 04:24 AM