ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:52 AM
ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పాడన్నారు.
విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తానని ఇప్పుడు మావిగన్ అంటున్నారు.. నిలకడ లేదు
మతమార్పిళ్లకు వైసీపీ ప్రోత్సాహం: విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. ఇప్పుడు మూడు రాజధానులను పక్కనపెట్టి మావిగన్ అంటున్నారని విమర్శించారు. ఆయనకు నిలకడ లేదని, అమరావతి రాజధానిగా కొనసాగుతున్నందున దానికి మద్దతు ఇవ్వకుండా ఇంకా దానిపై మాట్లాడడం అవివేకమని అన్నారు. విశాఖపట్నంలోని దసపల్లా హోటల్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మతమార్పిళ్లను వైసీపీ పెద్ద స్థాయిలో ప్రోత్సహిస్తున్నదని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది బాగా ఎక్కువగా ఉందని ఆరోపించారు. విజయదశమి తరువాత ఉత్తరాంధ్ర నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. తనపై కుట్రలు చేసి, లేనిపోనివి జగన్‌కు చెప్పి, పక్కకు తప్పించిన నాయకులకు దమ్ముంటే ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నంలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. విజయదశమి తరువాత పార్టీ పేరు ప్రకటిస్తానని, అందులో 66 శాతం యువతకు, బీసీలకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిని కానని, యువతనే ఆ సీట్లో కూర్చోబెడతానన్నారు. మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని స్పష్టం చేశారు.
దానికి కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డేనన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే జగన్ తనను కూరలో కరివేపాకులా పక్కన పెట్టారన్నారు. వైసీపీలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే ఆ పార్టీ నాశనం అవుతోందన్నారు. జగన్ నుంచి, ఆ పార్టీ నుంచి తనను దూరం చేసింది ఆయనేనని ఆరోపించారు. ఆయన కర్మకు ఆయనే పోతాడని శపించారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’