Share News

విభజన గాయాలున్నా.. అభివృద్ధి పథంలో ఏపీ

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:59 AM

ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకూ వేర్వేరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.

విభజన గాయాలున్నా.. అభివృద్ధి పథంలో ఏపీ

  • వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన వైపు పరుగులు

  • వచ్చే ఏడాది సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఇప్పుడే ఆహ్వానించడం బాబు ఆత్మవిశ్వాసానికి ప్రతీక: ఉపరాష్ట్రపతి

విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తరువాత అనేక గాయాలున్నప్పటికీ ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకూ వేర్వేరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండోరోజు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధన వైపు ఏపీ పరుగులు తీస్తోందని అన్నారు.

వచ్చేఏడాది నిర్వహించే సదస్సుకు కూడా పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఇప్పుడే ఆహ్వానించడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని ప్రశంసించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఎలక్ర్టానిక్స్‌, స్పేస్‌, డిఫెన్స్‌, టూరిజం వంటి రంగాల్లో ఏపీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు. ప్రతి సంక్షోభ సమయంలో భారత్‌తో పాటు ఏపీ కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోందని వివరించారు. అధునాతన ఏఐ టెక్నాలజీని ఏపీలో పాలన, పౌర సేవల కోసం వినియోగించడాన్ని ఆయన అభినందించారు.

మానవవనరుల నైపుణ్యాలను పెంచుకుని భారతీయ మేధో సంపత్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. వర్క్‌ టుగెదర్‌, గో టుగెదర్‌, షేర్‌ ప్రాస్పెరిటీ అనే విధానంలో పని చేద్దామని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నట్టు రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ జోషి, రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్‌, భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకులు, ఎండీ సుచిత్ర కె ఎల్లా తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 03:22 AM