సమష్టిగా ఎదుర్కొందాం!
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:57 AM
స్థానిక ఎన్నికలను సమర్థంగా, సమష్టిగా ఎదుర్కోవాలని ఎన్‌డీఏ సమన్వయ కమిటీ నిర్ణయించింది. స్థానిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ సమావేశం గురువారం తాడేపల్లిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో జరిగింది.
ఘన విజయమే లక్ష్యంగా ‘స్థానిక’ అభ్యర్థుల ఎంపిక
12లోపు కూటమి జిల్లా సమన్వయ కమిటీలు
మూడు పార్టీల నుంచి ముగ్గురు చొప్పున
ఎన్‌డీఏ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలను సమర్థంగా, సమష్టిగా ఎదుర్కోవాలని ఎన్‌డీఏ సమన్వయ కమిటీ నిర్ణయించింది. స్థానిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ సమావేశం గురువారం తాడేపల్లిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో జరిగింది. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్.. టీడీపీ తరఫున పల్లా, మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. మిత్రపక్షాల మధ్య సమన్వయం, క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని సమష్టిగా నిర్ణయించారు. కూటమి అభ్యర్థుల విజయానికి అవసరమైన కార్యాచరణను రూపొందించడంతో పాటు గ్రామ, మండల స్థాయుల్లో కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని నిశ్చయించారు. ఎన్నికలకు ముందే జిల్లా లేదా పార్లమెంటు స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 12వ తేదీలోపు వీటి నియామకం పూర్తి చేయాలని, ఒక్కో కమిటీలో మూడు పార్టీల నుంచి ముగ్గురు చొప్పున నియమించాలని నిశ్చయించారు. తర్వాత 15వ తేదీలోపు అసెంబ్లీ స్థాయిలో సమన్వయ కమిటీలను నియమిస్తారు. వీటిలో మూడు పార్టీల నుంచి ఒక్కొక్కరిని సభ్యులుగా నియమిస్తారు.