సత్యసాయి బోధనలు యువతకు స్ఫూర్తి
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:32 AM
సత్యసాయి బోధనలు యువతకు స్ఫూర్తి కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. సత్యసాయి ప్రేమతత్వం వెయ్యేళ్లయినా చెరిగిపోదని ఆయన అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో...
సత్యసాయి జయంత్యుత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేరళం వరదల్లో సేవాదళ్ సేవలు అమోఘం
కొనియాడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీశన్
పుట్టపర్తిలో ఘనంగా సత్య సాయి 101వ జయంతి వేడుకలు
పుట్టపర్తి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సత్యసాయి బోధనలు యువతకు స్ఫూర్తి కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. సత్యసాయి ప్రేమతత్వం వెయ్యేళ్లయినా చెరిగిపోదని ఆయన అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి 101వ జయంతి వేడుకల్లో సోమవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో యువత ప్రతిభకు కొరతలేదని, దేశ అభివృద్ధిలో యువతే కీలకమని తెలిపారు. సత్యసాయి బాబా జయంతి వేడుకలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ తరఫున కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి సేవలు అమూల్యం: సతీశన్
‘అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు’ అనే సత్యసాయి సిద్ధాంతం అమోఘమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేరళం సీఎం సతీశన్ అన్నారు. 2018లో కేరళ వరద బాధితులకు సత్యసాయి సేవా సంస్థలు అందించిన సేవలకు వెలకట్టలేమని తెలిపారు. నిరాశ్రయులైన పేదలకు పక్కాగృహాలు నిర్మించి ఇచ్చారని కొనియాడారు. కాగా.. సత్యసాయి 101వ జయంతి వేడుకల సందర్భంగా ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రశాంతి నిలయం నుంచి హిల్వ్యూ స్టేడియంలోని శాంతివేదిక వరకు సత్యసాయి బంగారు రథోత్సవం నిర్వహించారు. ట్రస్టు సభ్యులు చక్రవర్తి, ఆర్జే రత్నాకర్, కలెక్టర్ శ్యాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు.
నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత - సీఎం చంద్రబాబు
నిస్వార్థసేవే నిజమైన ఆధ్యాత్మికత అని చాటిన మహనీయుడు సత్యసాయిబాబా అని సీఎం చంద్రబాబు కొనియాడారు. సత్యసాయిబాబా 101 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆయన సోమవారం సందేశాన్నిచ్చారు. విద్య, వైద్య, తాగునీటి రంగాల్లో సత్యసాయి సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన సేవామార్గాన్ని అనుసరిద్దామని పిలుపునిచ్చారు.
గొప్ప మానవతావాది: లోకేశ్
విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను నెలకొల్పి, గొప్ప మానవతావాదిగా సత్యసాయి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని మంత్రి లోకేశ్ కొనియాడారు. ఆయన సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించేందుకు సత్యసాయి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: