Share News

చిన్నారి కోసం అంగుళం అంగుళం జల్లెడ పట్టాలని పవన్ ఆదేశాలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:05 PM

కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, పాప ఆచూకీ కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

చిన్నారి కోసం అంగుళం అంగుళం జల్లెడ పట్టాలని పవన్ ఆదేశాలు
Tuni Missing Girl Case: Deputy CM Pawan Kalyan Reviews Search Efforts

తుని, (కాకినాడ) జూన్ 13: కాకినాడ జిల్లా తునిలో ఓ చిన్నారి అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హృదయ విదారక ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇవాళ (శనివారం) ఆయన కాకినాడ జిల్లా ఎస్పీతో (SP) ఫోన్లో మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను, పాప ఆచూకీ కోసం ఇప్పటివరకు చేపట్టిన గాలింపు చర్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.


ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి.. అడవుల్లో జల్లెడ పట్టండి!

గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, కాలయాపన చేయకుండా త్వరితగతిన పాపను కనిపెట్టేందుకు మరిన్ని అదనపు బృందాలను రంగంలోకి దించాలని ఎస్పీని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అవసరమైతే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాల సేవలను కూడా తక్షణమే వినియోగించుకోవాలని సూచించారు.

పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లి గాలించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అటవీ శాఖ సహాయం తీసుకోవాలన్నారు. అడవుల గురించి పూర్తి అవగాహన ఉన్న అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, స్థానిక ఫారెస్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను సమన్వయం చేసుకుంటూ.. పరిసర అటవీ ప్రాంతాలన్నింటినీ అంగుళం అంగుళం జల్లెడ పట్టాలని (Combinaiton Operation) ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని, చిన్నారి ఆచూకీ కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ప్రతి వనరును ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్

Updated Date - Jun 13 , 2026 | 10:09 PM