‘శ్రీవారి యాత్ర సురక్ష’తో భక్తులకు భరోసా
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:21 AM
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా భరోసా కల్పిస్తున్నామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
దేశంలోనే తొలిసారి తిరుమలలో అమలు: టీటీడీ ఈవో
తిరుమలలో సహజ మరణానికి గురైన భక్తుల కుటుంబ సభ్యులకు పరిహారం అందజేత
తిరుమల, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా భరోసా కల్పిస్తున్నామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, శ్రీవారి సేవలో ఉండే ఉద్యోగులకు అండగా నిలుస్తామని వెల్లడించారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి సహజంగా మరణించిన ఏడుగురి కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ దొరైస్వామితో కలిసి మంగళవారం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా అనుకోకుండా మృతి చెందితే వారి కుటుంబాలకు చేయూత అందించేలా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సెప్టెంబరు 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించామని.. సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు అందిస్తున్నట్టు వివరించారు.
గత రెండు నెలల్లో 17 మంది తిరుమలలో మరణించారని, వారిలో ఏడుగురి కుటుంబ సభ్యులకు బీమా పరిహారాన్ని అందించామని తెలిపారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని చెప్పారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి దేశానికే ఆదర్శంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించినట్టు తెలిపారు. టీటీడీ కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చేందుకు సహకరించిన ఎల్‌ఐసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ఈ పరిహారాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
టీటీడీ మార్గదర్శకంగా నిలిచింది: దొరైస్వామి
భక్తులకు జీవిత బీమా కవరేజి అందించే విషయంలో టీటీడీ మార్గదర్శకంగా నిలిచిందని ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ దొరైస్వామి తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు శబరిమలైలోని ట్రావెన్‌కోర్ దేవస్వం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ అధికారులు తమతో సంప్రదింపులు జరిపారని వెల్లడించారు.
ఈ పథకం ద్వారా తిరుమల యాత్ర సమయంలో దురదృష్టవశాత్తు మరణించినవారికి రూ.2 లక్షలు అందజేశామన్నారు. మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భక్తుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన టీటీడీని అభినందించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి