Share News

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల హల్‌చల్.. పంటల ధ్వంసం

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:24 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి ఏనుగులు గ్రామ పరిసరాల్లోకి చొరబడి వరి తదితర పంట పొలాలను ధ్వంసం చేశాయి.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల హల్‌చల్.. పంటల ధ్వంసం
Tirupati elephants

తిరుపతి, ఆగస్టు 13: జిల్లాలోని చంద్రగిరి మండలం యల్లంపల్లిలో మరోసారి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి గ్రామ పరిసరాల్లోకి సుమారు 15 ఏనుగులు చొరబడి పంట పొలాలపై దాడి చేశాయి. వరి పంటతో పాటు పశువుల కోసం సాగు చేసిన గడ్డి పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. రైతులు ధనప్రకాష్ రెడ్డి, మల్లీశ్వరి, పురుషోత్తం రెడ్డికి చెందిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాత్రివేళ ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంట పొలాల్లోకి రావడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగుల దాడితో నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఏనుగుల గుంపు మళ్లీ గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండటంతో యల్లంపల్లి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏనుగులు ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తాయో తెలియక రైతులు రాత్రివేళ పొలాల వద్దకు వెళ్లేందుకు సైతం భయపడుతున్నారు. పంట నష్టానికి పరిహారం అందించడంతో పాటు ఏనుగులు గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు రంగంలోకి దిగి ఏనుగుల కదలికలను పరిశీలిస్తున్నారు. ఏనుగుల గుంపును సురక్షితంగా అటవీ ప్రాంతం వైపు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.


Also Read:

ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు..

రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే..

Updated Date - Aug 13 , 2026 | 11:56 AM