ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు..
ABN , Publish Date - Aug 11 , 2026 | 05:35 PM
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో బేసిక్ రూమ్ రెంట్ అదే ప్రాంతంలోని 3-స్టార్ హోటళ్లలో వసూలు చేస్తున్న సగటు అద్దెను మించకూడదని సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో నగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో బేసిక్ రూమ్ రెంట్ అదే ప్రాంతంలోని 3-స్టార్ హోటళ్లలో వసూలు చేస్తున్న సగటు అద్దెను మించకూడదని సిఫారసు చేసింది. ఆస్పత్రుల బిల్లుల్లో గది అద్దెలు భారీగా ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం ఉందని కమిటీ పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల బిల్లింగ్ విధానాన్ని పరిశీలించి గది అద్దెలను అత్యవసర ప్రాతిపదికన హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు పెద్ద మెట్రో నగరాల్లోని ఆస్పత్రి సమీప ప్రాంతాల్లో ఉన్న 3-స్టార్ హోటళ్ల సగటు గది అద్దెను ప్రామాణికంగా తీసుకుంది. దాని కంటే ఎక్కువగా ఆస్పత్రి బేసిక్ రూమ్ ఛార్జీ ఉండకూడదని సూచించింది. ఈ ప్రమాణాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు తప్పనిసరి చేయాలని సిఫారసు చేసింది. ఈ సందర్భంగా ఆస్పత్రి గది, హోటల్ గది ఒక్కటి కాదని స్పష్టం చేసింది. ఆస్పత్రి గదితోపాటు నర్సింగ్, రోగి పర్యవేక్షణ, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, అత్యవసర వైద్య సేవలు, ఇతర వైద్య మౌలిక సదుపాయాలు అందుతాయని పేర్కొంది. 3-స్టార్ హోటల్ ధరను పోలికగా తీసుకోవడం కేవలం గది అద్దెను హేతుబద్ధీకరించేందుకేనని తెలిపింది.
అలాగే ప్రైవేటు వైద్య రంగంలో బిల్లింగ్ పారదర్శకత పెంచడంపైనా కమిటీ దృష్టి పెట్టింది. ముఖ్యమైన చికిత్సలు, శస్త్రచికిత్సలు, పరీక్షలకు సంబంధించిన ధరలను స్పష్టంగా అందుబాటులో ఉంచాలని సూచించింది. పెద్ద చికిత్సలకు ముందు రోగులు, వారి కుటుంబ సభ్యులకు మొత్తం చికిత్సకు అయ్యే అంచనా వ్యయాన్ని సమగ్రంగా తెలియజేయాలని కోరింది. దీంతో చికిత్స మధ్యలో ఊహించని భారీ బిల్లులను నివారించవచ్చని అభిప్రాయపడింది. బీమా ఉన్న రోగులు, బీమా లేని రోగుల నుంచి వేర్వేరు రేట్లు వసూలు చేసే విధానంపైనా కమిటీ దృష్టి సారించింది. దీనిపై మరింత పరిశీలన అవసరమని, బీమా రంగ నియంత్రణ సంస్థ ఈ అంశాన్ని స్పష్టంగా పరిశీలించాలని సూచించింది. అంతేకాకుండా ప్రీమియం చెల్లించే రోగుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల చికిత్సకు వినియోగించే విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్నీ కమిటీ ప్రస్తావించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఏళ్ల తర్వాత ఎస్‌బీఐ లాకర్ తెరిచిన మహిళకు షాక్..
హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి..