రూ.3 కోట్లు ఇవ్వకుంటే కుటుంబాన్ని చంపేస్తాం! పెళ్లి రద్దుతో అబ్బాయికి బెదిరింపులు
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:37 AM
డేటింగ్ యాప్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఆపై పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. రేపోమాపో వివాహం అనుకుంటున్న తరుణంలో తలెత్తిన విభేదాలతో పెళ్లి ఆగిపోయింది.
తిరుపతి (నేరవిభాగం), (ఆంధ్రజ్యోతి): డేటింగ్ యాప్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఆపై పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. రేపోమాపో వివాహం అనుకుంటున్న తరుణంలో తలెత్తిన విభేదాలతో పెళ్లి ఆగిపోయింది. దీంతో అమ్మాయి రూ.3 కోట్లు ఇవ్వాలని లేదంటే మీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ అబ్బాయికి బెదిరింపు ఈ-మెయిల్స్ పంపుతోంది. అబ్బాయి ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు అమ్మాయిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... తిరుపతి పోస్టల్ కాలనీలో నివాసముంటున్న ఏఆర్ వంశీ తమిళనాడులోని విజయా హాస్పిటల్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన నమ్రత.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఓ డేటింగ్ యాప్ ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఇరు పెద్దల అంగీకారంతో హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కొంతకాలానికి నగదు, ఆస్తులు, తదితర విషయాలపై ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నమ్రత వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వంశీపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా... రూ.3 కోట్లు ఇవ్వకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ నమ్రత ఇటీవల వంశీకి ఈ మెయిల్స్ పంపించసాగింది. ఈ బెదిరింపులు ఎక్కువ కావడంతో వంశీ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా పరిశీలించిన సీఐ శ్రీనివాసులు ఐటీ చట్టం కింద నమ్రతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News