తిరుపతిలో ఏడు టన్నుల విభూతితో 11 అడుగుల భారీ వినాయకుడు..
ABN , Publish Date - Sep 14 , 2026 | 07:53 PM
వినాయక చవితి సందర్భంగా తిరుపతిలో ఓ భారీ విభూది గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఏకంగా ఏడు టన్నుల పవిత్ర విభూతితో 11 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ విభూది గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తిరుపతి, సెప్టెంబర్ 14: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏకంగా ఏడు టన్నుల పవిత్ర విభూతితో 11 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశైలం, మహానంది వంటి ప్రముఖ శైవక్షేత్రాల నుంచి ప్రత్యేకంగా విభూతిని తెప్పించి.. ఈ విగ్రహాన్ని రూపొందించారు. సినీ ఆర్ట్ ఆర్కిటెక్ట్ రామస్వామి నేతృత్వంలో 16 మంది కళాకారులు ఏడు రోజుల పాటు శ్రమించి అత్యంత ఆకర్షణీయంగా విభూది గణపతిని రూపొందించారు. తుమ్మలగుంట బాల వినాయక కమిటీ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక రూపంలో కొలువుదీరిన ఈ విభూది గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
విభూది గణపతి మండపం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. విభూతితో రూపొందించిన గణపతిని దర్శించుకునేందుకు తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తుమ్మలగుంటకు తరలివస్తున్నారు. దీంతో మండపం పరిసరాల్లో సందడి నెలకొంది. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నల్లగొండలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News