Share News

డిసెంబరు 20 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:55 AM

డిసెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగనున్నాయి. ఈక్రమంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ..

డిసెంబరు 20 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

  • ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

తిరుమల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): డిసెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగనున్నాయి. ఈక్రమంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో వివిధ విభాగాల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు తొలి మూడురోజులకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్‌ ద్వారా ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత ఏడు రోజులకు సర్వదర్శనాలను అమలు చేయాలని సూచించారు. డిసెంబరు 25వ తేదీ శుక్రవారం అభిషేక సమయంలో కూడా సర్వదర్శన భక్తులకు దర్శనం చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా.. తిరుమలలోని వాటర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలసిస్‌ ల్యాబ్‌ను దేశానికే ఆదర్శవంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ల్యాబొరేటరీని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో కేవలం 11 నెలల్లోనే అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని ఇతర దేవదాయ సంస్థల్లో లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్‌ను నిర్మించినట్టు వెల్లడించారు. నెయ్యి నమూనాలను రోజూ పరీక్షించాకే తిరుమలలో వినియోగానికి అనుమతి ఇస్తున్నట్టు వెంకయ్య చౌదరి వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:55 AM