భక్తులకు ఒకేరోజు రెండు దర్శనాలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:26 AM
తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఒకేరోజు మూలవిరాట్టు దర్శనంతో పాటు మాడ వీధుల్లో వాహనాలపై మలయప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
శ్రీవారి మూలవిరాట్టుతో పాటు వాహన సేవలో మలయప్ప దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు
ఈసారి 17 రోజుల్లోనే రెండుసార్లు బ్రహ్మోత్సవాలు
2 నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేశాం
‘ఆంధ్రజ్యోతి’తో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుపతి(టీటీడీ)/తిరుమల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఒకేరోజు మూలవిరాట్టు దర్శనంతో పాటు మాడ వీధుల్లో వాహనాలపై మలయప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అధికమాసం నేపథ్యంలో ఈసారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయని చెప్పారు. ఈ రెండింటి మధ్య 17 రోజుల సమయం మాత్రమే ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ, భక్తులకు దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాదం వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా ముందునుంచే నెయ్యి, బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, చక్కెర, డ్రైఫ్రూట్స్ తదితరాలను రెండు బ్రహ్మోత్సవాలకూ సరిపడా సేకరించి గోడౌన్లలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. భక్తుల కోసం గత ఏడాది 8 లక్షల మేరకు లడ్డూలు బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచగా, ఈసారి 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.
43 కేంద్రాల్లో అన్నప్రసాదం పంపిణీ
‘‘శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఆ రోజు దాదాపు 23 లక్షల అన్నప్రసాదాలు, టీ, కాఫీ, మజ్జిగ తదితరాలను పంపిణీ చేయనున్నాం. అన్నప్రసాదాల పంపిణీకి 43 కేంద్రాలు ఏర్పాటు చేశాం. అక్కడ భక్తులకు 12 రకాల ప్రత్యేక వంటకాలను అందించనున్నాం.
సమాచార వ్యవస్థ పూర్తిస్థాయిలో బలోపేతం
టీటీడీలోని రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలతో పాటు పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థతోనూ సమన్వయం ఏర్పర్చుకుని భక్తులు వాహన సేవలు తిలకించేందుకు ఏర్పాట్లు చేపట్టాం. ఈ కేంద్రాల ద్వారా నడకదారిలో ఎంతమంది భక్తులు వస్తున్నారు, క్యూలైన్‌లో, కంపార్ట్‌మెంట్లలో ఎంతమంది ఉన్నారు, వాహనాలు ఎన్ని వస్తున్నాయనే సమాచారం తెలుస్తుంది. కొండకు వచ్చిన భక్తుల్లో క్యూలైన్లలోకి ఎంతమంది వస్తున్నారు, గ్యాలరీల్లోకి ఎంతమంది వెళ్లనున్నారనేది పరిశీలించనున్నాం. సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేశాం. దీనిద్వారా రద్దీకి అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టనున్నాం. ఎక్కడికక్కడ సమాచార కేంద్రాల్లో భక్తులతో పాటు అధికారులకూ వివరాలు అందించనున్నాం. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. మాడ వీధుల నుంచి భక్తులు బయటకు వచ్చే ప్రాంతాలను అనుసరించి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచనున్నాం. తిరుమలలో ప్రైవేటు వాహనాల నియంత్రణకు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను నడపనున్నాం’ అని వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.
3 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 3వేల మంది పోలీసులను డిప్యుటేషన్‌పై తీసుకున్నాం. వీరితోపాటు 2,300 మంది విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వెయ్యిమంది వరకు టీటీడీ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నాం. తిరుపతిలో ఆగిపోయిన వారికోసం ఐదు ప్రాంతాల్లో స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే పార్కింగ్, భోజన సదుపాయాలు కల్పిస్తాం.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’