చర్యల మాటేంటి?
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:39 AM
కలెక్టర్ల సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు, గంటలకొద్దీ రిపోర్టు ప్రజంటేషన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలకు సర్కారు చెక్ పెట్టనుంది. ఈనెల 10-11 తేదీల్లో జరిగే ఎనిమిదో విడత జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే ఇందుకు శ్రీకారం చుట్టనుంది. జిల్లా కలెక్టర్ల కార్యాచరణ ఏమిటి....జిల్లాల్లో ఏం సాధించారు....ఏ విషయాల్లో వెనకబడ్డారు...అందుకు గల కారణాలు ఏమిటి...గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు వాస్తవిక పరిస్థితి ఏమిటన్న కోణంలో ఈ దఫా సమావేశాలను నిర్వహించాలనుకుంటోంది.
ముందు ‘ఏటీఆర్’.. తర్వాతే కొత్త టాస్క్
కలెక్టర్ల సమావేశంలో కీలక అజెండా ఇదే
ఇచ్చిన ఆదేశాల వాస్తవ అమలుపై లోతైన సమీక్ష
రెండు రోజుల సమావేశాల్లో ఇదే తొలి అంశం
కలెక్టర్ల నుంచి పనితనం రాబట్టడమే లక్ష్యం
శాఖల ప్రజంటేషన్లు, ఉపన్యాసాలు కుదింపు
(అమరావతి - ఆంధ్రజ్యోతి) : కలెక్టర్ల సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు, గంటలకొద్దీ రిపోర్టు ప్రజంటేషన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలకు సర్కారు చెక్ పెట్టనుంది. ఈనెల 10-11 తేదీల్లో జరిగే ఎనిమిదో విడత జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే ఇందుకు శ్రీకారం చుట్టనుంది. జిల్లా కలెక్టర్ల కార్యాచరణ ఏమిటి....జిల్లాల్లో ఏం సాధించారు....ఏ విషయాల్లో వెనకబడ్డారు...అందుకు గల కారణాలు ఏమిటి...గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు వాస్తవిక పరిస్థితి ఏమిటన్న కోణంలో ఈ దఫా సమావేశాలను నిర్వహించాలనుకుంటోంది. అంటే, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు జిల్లా స్థాయిలో ఏ మేరకు అమలయ్యాయి....వాటి ఫలితాలు ఏమిటి....ఏ ఏ అంశాల్లో ముందడుగు వేయలేకపోయారు...ఇందులో ఉన్న సమస్యలేమిటనే వైపుగా చర్చ జరిగేలా ?(ఏటీఆర్- యాక్షన్ టేకెన్ రిపోర్టు) ప్రభుత్వం ఎనిమిదో విడత సమావేశ అజెండా రూపొందించింది. ఏడో విడత కలెక్టర్ల సమావేశం మే 7-8 తేదీల్లో సచివాలయం కేంద్రంగా జరిగింది. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు పలు కీలక ఆదేశాలిచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రెవెన్యూ, పరిశ్రమలు వంటి కీలక రంగాల్లో అనేక ఆదేశాలిచ్చారు. ఈసారి.. గత సమావేశాల్లో సీఎం, శాఖల కార్యదర్శులు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్లు ఏ మేరకు అమలు చేశారు ...
ఇచ్చిన లక్ష్యాలను సాధించారా... లేదా.. ఫలితాల సాధనలో జిల్లా ర్యాంకు ఎంత....టార్గెట్లను ఏ మేరకు పెండింగ్ పెట్టారన్న అంశాలపై ఈ దఫా సమావేశాల్లో తొలి అజెండాగా చర్చ జరగనుంది. దీన్ని ఆధారాలతో కూడిన చర్చగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ఇదే తొలి అజెండాగా ఉంటుంది. ఆ తర్వాతే ఆర్థిక, ప్రణాళిక, ఇతర అంశాలపై చర్చిస్తారు. సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించిన తర్వాత దీనిని అజెండాలో తొలి అంశంగా తీసుకుంటారు. ముఖ్యమంత్రి ఆదేశాలను జిల్లాలవారీగా అమలు చేయకపోయినా, అసంపూర్ణంగా వదిలేసినా, అసలు అమలే చేయకపోయినా...అందుకు గల కారణాలను కలెక్టర్ల నుంచి రాబట్టనున్నారు. ఏమీ చేయకున్నా, అన్నీ చేసేశామంటూ కొందరు కలెక్టర్లు తప్పించుకోవడం గత సమావేశాల్లో ప్రభుత్వం గమనించింది. ఈ నేపఽథ్యంలో గత సమావేశాల ఏటీఆర్ ఏంటో ముందే సమావేశంలో ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు. కాబట్టి, ఆయా అంశాలపై కలెక్టర్లు విధిగా తమ ఏటీఆర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. కలెక్టర్ల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు అమలు కావడం లేదని, అయినా ప్రభుత్వం ప్రతిసారీ ఏటీఆర్‌పై చర్చ చేయకుండా కలెక్టర్‌లకు కొత్త టార్గెట్లు ఇస్తోందని, అవి జిల్లాల్లో అడుగు కూడా కదలడం లేదన్న విమర్శలున్నాయి. కలెక్టర్ల సమావేశాలు కలర్‌పుల్ ప్రజంటేషన్‌లు, ముఖ్యమంత్రి, కార్యదర్శుల ఉపన్యాసాలకు వేదికగా మారుతోందని, కలెక్టర్లు ఆశించిన స్థాయిలో పురోగతి చూపించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఏవిధంగా ఉందో ముందు గుర్తించి, ఆ తర్వాత కలెక్టర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే తొలిరోజు అజెండాలో దానిని మొదటి అంశంగా చేర్చారు. అయితే, కలెక్టర్లకు ఇచ్చిన టాస్క్‌లను నాలుగు కోణాల్లో పరిశీలించి ర్యాంకులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. లక్ష్యం, సాధన, ర్యాంకు ఆధారంగా ఏటీఆర్ పురోగతిని పరిశీలించనుంది. అయితే, ఈసారి సమావేశాల అజెండా, శాఖల ప్రజంటేషన్ కూడా విభిన్నంగా ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రతీ శాఖ ప్రజంటేషన్ ఇచ్చి, దానిపై కొంత చర్చ జరిగేదాన్ని కన్నా, అంశాల వారీగా గ్రూప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్థికం, వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, పాలన, సాంకేతికత, పెట్టుబడులు, భూములు, శాంతి భద్రతల కోణంలో గ్రూపులు ఏర్పాటుచేసి అందుకు సంబంధించిన అంశాలపై ప్రజంటేషన్లు, చర్చలు ఉండేలా అజెండాను సిద్ధం చేశారు.
కీలకమైన అంశాల్లో ఉపన్యాసాలు తగ్గించాలనుకుంటోంది. ఫలితాలు, వాస్తవిక పరిస్థితితో కూడిన ప్రజంటేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోంది. దాంట్లోనే అన్ని కోణాలు కనిపించేలా రూపొందించాలని, ఇప్పటికే ఇటు ఆయా శాఖల కార్యదర్శులు, అటు విభాగాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రెండో రోజు కలెక్టర్లతో ఓపెన్ ఫోరమ్ చర్చకు అవకాశం ఇవ్వనుంది. దీంట్లో కలెక్టర్ తన జిల్లా పరిధిలోని పలు అంశాలను ప్రస్తావించేలా అవకాశం ఇస్తారు. ఆ రోజు శాంతి భద్రతలపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేసి సమావేశాన్ని ముగిస్తారు.
తొలి రోజు...
ఏటీఆర్‌పై చర్చ అనంతరం ఆర్థిక పరిస్థితులపై ప్రణాళిక, ఆర్థికశాఖల ప్రజంటేషన్లు ఉంటాయి. స్వర్ణాంధ్ర, సూపర్ సిక్స్, సంక్షేమ పథకాలు, తాగునీటి సరఫరా ప్రణాళిక, గృహ నిర్మాణం, ఉద్యోగ కల్పన, విద్య, వైద్య, ఆరోగ్యం, కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు, జలధార, జిల్లాల ఉత్తమ పనితీరు మోడల్స్‌పై చర్చ ఉంటుంది.
రెండో రోజు..
ఉదయం ఈ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, పీజీఆర్‌ఎస్, డేటాలేక్ వంటి అంశాలపై చ ర్చ ఉంటుంది. అనంతరం పాజిటివ్ పబ్లిక్ పెర్‌సెప్షన్, రెవెన్యూ శాఖ, భూపరిపాలన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగం, స్కిల్ డెవల్‌పమెంట్, ఉద్యోగ కల్పనపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత కలెక్టర్లతో ఓపెన్ ఫోరం ఉంటుంది. చివరిగా శాంతి భద్రతలను సమీక్షిస్తారు. చర్చను సాయంత్రం 5.20 గంటలకు ముగించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
అజెండాలో కనిపించని..ఎల్‌నినో
కలెక్టర్ల సమావేశం అజెండాను అధికారులు ప్రాథమికంగా ఖరారు చేశారు. అయితే, ఇందులో ఎల్ నినో అంశం చేర్చలేదు. కరువు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ అంశాన్ని అజెండాలో చేర్చి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది.
ఈ వార్తలను కూడా చదవండి
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా