‘టెట్’ గట్టెక్కినట్టే!
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:35 AM
ఉపాధ్యాయుల గొంతుపై కత్తిలా మారిన ‘టెట్’ అర్హత అడ్డంకులు క్రమంగా తొలగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత రాష్ట్రంలో రెండుసార్లు జరిగిన టెట్‌లో పాల్గొన్న ఇన్ సర్వీస్ టీచర్లలో 53 వేల మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. గతేడాది అక్టోబరులో జరిగిన టెట్‌లో 15,239 మంది అర్హత సాధించగా, ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్‌లో 37,789 మంది టెట్ పాసయ్యారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు క్రమంగా తొలగుతున్న ‘ఉద్యోగ అనర్హత’ ముప్పు
గత అక్టోబరు, ఈ ఏడాది జూన్‌లో జరిగినరెండు టెట్‌ల్లో 53 వేల మంది ఉత్తీర్ణత
ఇంకా అర్హత సాధించాల్సిన 34,500 మంది
ప్రత్యేక టెట్‌కు 46 వేలకు పైగా అప్లికేషన్లు
దీంతో దాదాపు అందరు ఉపాధ్యాయులూ అర్హత సాధించే అవకాశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల గొంతుపై కత్తిలా మారిన ‘టెట్’ అర్హత అడ్డంకులు క్రమంగా తొలగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత రాష్ట్రంలో రెండుసార్లు జరిగిన టెట్‌లో పాల్గొన్న ఇన్ సర్వీస్ టీచర్లలో 53 వేల మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. గతేడాది అక్టోబరులో జరిగిన టెట్‌లో 15,239 మంది అర్హత సాధించగా, ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్‌లో 37,789 మంది టెట్ పాసయ్యారు. ఇంకా సుమారు మరో 34,500 మంది టెట్ అర్హత సాధించాల్సి ఉంది. కాగా, ఇన్ సర్వీస్ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక టెట్‌కు అర్హత సాధించాల్సిన మిగతా అభ్యర్థులు 46,322 పేపర్లకు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఒకటే పేపర్ రాస్తుంటే, ఎస్జీటీల్లో కొందరు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఉండగా.. సుమారు 50 వేల దరఖాస్తులు ప్రత్యేక టెట్‌కు అందుతాయని అధికారులు అంచనా. ఈ స్పెషల్ టెట్ నిర్వహణతో రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ టీచర్లకు దాదాపుగా ‘టెట్ అర్హత’ ముప్పు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. టీచర్లంతా అర్హత సాధించే వరకూ ఏడాదికి కనీసం రెండుసార్లు టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
తొలుత ఉద్యోగం... ఆ తర్వాత పదోన్నతి
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2028 సెప్టెంబరు నాటికి ఇన్ సర్వీస్ టీచర్లంతా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. అయితే ఇందులో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఉంది. పదోన్నతి పొందాలంటే మాత్రం అందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తొలుత అసలు అందరూ ఉద్యోగం కాపాడుకునేందుకు టెట్ అర్హత సాధించాల్సి ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే రెండు పేపర్లు రాయాల్సి ఉంది. మొదట ఎస్జీటీ ఉద్యోగం నిలబెట్టుకునేందుకు పేపర్ 1ఏ లేదా 1బీ రాయాలి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందాలంటే 2ఏ లేదా 2బీ పరీక్షలో అర్హత సాధించాలి. పదోన్నతితో సంబంధం లేకుండా ఉద్యోగం కొనసాగింపునకు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిన వారు 2025 అక్టోబరులో జరిగిన టెట్ తర్వాత 72,338 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. వారిలో 37,789 మంది ఈ ఏడాది జూన్ టెట్‌లో ఉత్తీర్ణులయ్యారు.
ఓపెన్ కేటగిరీకి సంక్లిష్టత
ఇన్‌సర్వీస్ టీచర్లలో ఓపెన్ కేటగిరీ వారికి టెట్ సంక్లిష్టంగా మారింది. 150 మార్కులకు జరిగే టెట్‌లో ఓసీలకు 60 శాతం అంటే 90 మార్కులు రావాలి. బీసీలు 75 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ 60 మార్కులు తెచ్చుకోవాలి. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఒకేవిధంగా ఉత్తీర్ణత మార్కులు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణత మార్కులు కుదింపు సాధ్యం కాదు. చాలామంది సీనియర్ టీచర్లకు కంప్యూటర్ ఆపరేట్ చేయడంపై అవగాహన లేదు. ప్రస్తుతం టెట్ పరీక్షలన్నీ సీబీటీ విధానంలోనే జరుగుతున్నాయి. దీంతో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేక టెట్‌తో దాదాపుగా అర్హత!
ప్రత్యేక టెట్ తర్వాత అర్హత సాధించాల్సిన టీచర్లు అతికొద్ది మంది మాత్రమే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 53 వేల మంది అర్హత సాధించడంతో మిగిలిన వారు ప్రత్యేక టెట్‌లో అర్హత సాధించే అవకాశం కనిపిస్తోంది. అయితే సిలబ్‌సలో మార్పులు చేయాలని టీచర్లు కోరుతున్నారు. ఏ సబ్జెక్టు బోధించే వారికి ఆ సబ్జెక్టు సిలబస్ మాత్రమే ఉండాలని సైన్స్, గణితం టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: