వారసులొస్తున్నారు!
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:25 AM
టీడీపీ సీనియర్ నేతలు తమ వారసుల రాజకీయ అరంగేట్రానికి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని వేదికగా చేసుకున్నారు.
జడ్పీ చైర్మన్ రేసులో టీడీపీ సీనియర్ల సంతానం..
అనంతపురం నుంచి పరిటాల శ్రీరాం
అన్నమయ్య-సుగవాసి ప్రసాద్.. విజయనగరం-మజ్జి సిరిసహస్ర.. తిరుపతి పనబాక చేతన
కోనసీమలో గొల్లపల్లి అమూల్య.. ఏలూరు నుంచి చింతమనేని నవ్య
అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నేతలు తమ వారసుల రాజకీయ అరంగేట్రానికి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని వేదికగా చేసుకున్నారు. తాజాగా జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన పలువురు వారసులు ఈ పీఠమెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 10 జడ్పీ చైర్‌పర్సన్ స్థానాలపై కన్నేసిన సీనియర్ నేతలు.. తమ సంతానాన్ని రంగంలోకి దించారు.
అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు, పార్టీ ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరాం ముందంజలో ఉన్నారు. నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన ఈయన జడ్పీ చైర్మన్ కావడం లాంఛనమేనని సమాచారం. అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో సుగవాసి ప్రసాదరావు ముందు వరుసలో ఉన్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఈయన తండ్రి పాలకొండరాయుడు పార్టీలో ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు. అన్నమయ్య జడ్పీ చైర్మన్‌గా ప్రసాదరావు ఎంపిక కూడా లాంఛనమే. ఈయన గాలివీడు జడ్పీటీసీ నుంచి విజయం సాధించారు.
వీరేశ్ చంద్రదేవ్
పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కోసం టీడీపీ సీనియర్ నాయకుడు, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు మేనల్లుడు వైరిచర్ల వీరేశ్‌చంద్రదేవ్ పోటీ పడుతున్నారు. ఈయన కురుపాం జడ్పీటీసీ స్థానంలో టీడీపీ తరఫున విజయం సాధించారు.
గొల్లపల్లి అమూల్య
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జడ్పీ చైర్‌పర్సన్ పీఠానికి వైసీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు దత్తపుత్రిక గొల్లపల్లి అమూల్య (మామిడికుదురు జడ్పీటీసీ) రేసు లో ఉన్నారు. సూర్యారావు వైసీపీ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండగా.. కుమార్తె అమూల్య అదే నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు.
చింతమనేని నవ్య
ఏలూరు జడ్పీ చైర్మన్ రేసులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్య ఉన్నారు. ఈమె పెదవేగి జడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పనబాక చేతన, హేమలత
తిరుపతి జడ్పీ చైర్‌పర్సన్ పదవికి కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి కుమార్తె డాక్టర్ చేతన పోటీ పడుతున్నారు. ఈమె శ్రీకాళహస్తి జడ్పీటీసీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమెతోపాటు సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈమె నాగులాపురం జడ్పీటీసీగా ఎన్నికల్లో విజయం సాధించారు
సిరి సహస్ర
విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో ఇటీవల టీడీపీలో చేరిన సీనియర్ నేత మజ్జి శ్రీను కుమార్తె మజ్జి సిరిసహస్ర ఉన్నారు. తెర్లాం జడ్పీటీసీ స్థానంలో ఈమె విజయం సాధించినప్పటికీ.. కులధ్రువీకరణ పత్రం విషయంలో వివాదం తలెత్తడంతో ఆమెతోపాటు మరో పేరునూ ఇక్కడ పరిశీలిస్తున్నారు. మజ్జి శ్రీను వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..