వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:07 AM
స్థానిక ఎన్నికల నామినేషన్లలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, విధ్వంసాలపై ఎస్ఈసీకి టీడీపీ బృందం గురువారం ఫిర్యాదు చేసింది.
ఎన్నికల సంఘాన్ని కోరిన టీడీపీ
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నామినేషన్లలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, విధ్వంసాలపై ఎస్ఈసీకి టీడీపీ బృందం గురువారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ వర్ల రామయ్య, పర్చూరి అశోక్‌బాబు, నీలాయపాలెం విజయకుమార్ తదితరులు ఎన్నికల కమిషనర్‌ను కలసి సమగ్ర లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేశారు. ఏడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు సృష్టించిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోల పెన్‌డ్రైవ్‌ను అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ‘విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై రోజా దాడి చేసి నీచమైన పదజాలంతో దూషించడం క్షమించరాని నేరం. పోలీసులను బూతులు తిడుతూ ఆడవాళ్లపై అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాం’ అని వర్ల తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: