ఇదా మీ నిర్వాకం?
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:35 AM
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ.. అనంతపురం కార్పొరేషన్‌ను కోల్పోవడం, నందికొట్కూరు, బేతంచర్ల, నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానాలను వైసీపీ గెలుచుకోవడాన్ని టీడీపీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఆ ఎమ్మెల్యేలపై టీడీపీ పోస్టుమార్టం!
కొన్ని స్థానిక సంస్థల్లో ప్రతికూల ఫలితాలపై సీరియస్
అనంత, గన్నవరం, పామర్రు, కదిరి,శింగనమల, తిరుపతి, మడకశిరపై ప్రత్యేక నివేదికలు
జీడీ నెల్లూరు, పుట్టపర్తి నియోజకవర్గాలపైనా..
నివేదికల తయారీలో ప్రాంతీయ సమన్వయకర్తలు
కూటమిలో సమన్వయ లోపంతో వైసీపీకి లబ్ధి
అభ్యర్థుల ఎంపికలో లోపాలు
ఆయా ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్ల కూడా..
ఉత్తరాంధ్రలో ఇద్దరు మంత్రుల తీరుపై గుర్రు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వైఖరికి వ్యతిరేకంగా పనిచేసి.. కూటమి అభ్యర్థుల ఓటమికి బాధ్యులుగా భావిస్తున్న ఎమ్మెల్యేలపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది. శ్రేణుల మనోభావాలకు వ్యతిరేకంగా.. పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన శాసనసభ్యులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను ఆదేశించింది. దీంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ.. అనంతపురం కార్పొరేషన్‌ను కోల్పోవడం, నందికొట్కూరు, బేతంచర్ల, నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానాలను వైసీపీ గెలుచుకోవడాన్ని టీడీపీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలను దక్కించుకోవడానికి ప్రధాన కారణం.. కూటమిలో సమన్వయ లోపమేనని భావిస్తున్నారు.
మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నేతల నడుమ మరింత మెరుగైన సమన్వయం ఉంటే.. వైసీపీ 74 జడ్పీటీసీలు, 1711 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకునేది కాదని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ప్రాంతీయ సమన్వయకర్తల నివేదికలను పరిశీలించిన తర్వాత బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలని భావిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు సరిగాలేక.. వైసీపీ ఎక్కువగా లాభపడిన స్థానాలపై ప్రత్యేక నివేదికలు ఇవ్వాలని సమన్వయకర్తలను కోరినట్లు సమాచారం.
వీరి నిర్లక్ష్యం.. వైసీపీకి వరం..
అనంతపురం జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్ మేయర్ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే ఈ స్థానాన్ని కూటమి అతి తక్కువ మెజారిటీతో కోల్పోయామని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు మొత్తం 62,196 ఓట్లు వస్తే కూటమి మేయర్ అభ్యర్థికి 56,238 ఓట్లే వచ్చాయి. టీడీపీకి కంచుకోటలాంటి స్థానంలో కూటమి అభ్యర్థి ఓడిపోవడానికి కేవలం ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమని.. ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే గెలుపు సునాయాసమయ్యేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో గన్నవరం, పామర్రు ఎమ్మెల్యేల తీరుపైనా టీడీపీ నాయకత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. వైసీపీ గన్నవరం నియోజకవర్గ కేంద్రంలోని జడ్పీటీసీ స్థానంలోను, 24 ఎంపీటీసీల్లో ఏడింటిలోను గెలిచింది. మరో 2 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ఉంగుటూరు మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాల్లో సగం వైసీపీపరమయ్యాయి. టీడీపీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ నియోజకవర్గంలో వైసీపీ గట్టి పోటీ ఇవ్వడాన్ని పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యే తీరు కారణంగా మొవ్వ జడ్పీటీసీని కూటమి కోల్పోయామని వారు భావిస్తున్నారు. ఈ స్థానాన్ని టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నన్నపనేని రవీంద్ర ఆశించారు. అయితే పొత్తులో జనసేనకు కేటాయించారు. ఎమ్మెల్యే కావాలనే మొవ్వ స్థానాన్ని జనసేనకు వెళ్లేలా చేశారన్నది నరేంద్ర వర్గీయుల ఆరోపణ. దీంతో ఆయన రెబల్‌గా బరిలోకి దిగి జనసేన అభ్యర్థిపై విజయం సాధించారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైసీపీ 85 ఎంపీటీసీ స్థానాల చొప్పున కైవసం చేసుకుంది. తిరుపతిలో 6 జడ్పీటీసీలు, చిత్తూరులో 4 జడ్పీటీసీల్లో విజయం సాధించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 6 జడ్పీటీసీలకుగాను వైసీపీ 3చోట్ల నెగ్గింది. నియోజకవర్గంలో 96 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 42 ఏకగ్రీవం కాగా.. 54 స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ 17 చోట్ల విజయం సాధించింది. ఇక్కడ ఆ పార్టీ పుంజుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే వైఖరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోనూ ఇదే పరిస్థితి.
అనంతపురం జిల్లా శింగనమలలో వైసీపీ పైచేయి సాధించడంపైనా టీడీపీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారు. నార్పల మండలంలో క్యాడర్ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేశారు. దీంతో ఇక్కడ స్థానిక టీడీపీ నాయకులే తిరుగుబాటు చేశారు. ఫలితంగా నార్పల, శింగనమల జడ్పీటీసీలతోపాటు మెజారిటీ ఎంపీటీసీలను వైసీపీ గెలుచుకుంది. ముఖ్యంగా నార్పల మండలంలోని 15 ఎంపీటీసీలకు 13 చోట్ల విజయం సాధించింది.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో వైసీపీ గణనీయంగానే స్థానాలను గెలుచుకుంది. 9 జడ్పీటీసీలతోపాటు 100 ఎంపీటీసీలను కైవసం చేసుకుంది. అక్కడి ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తే దీనికి ప్రధాన కారణమని టీడీపీ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చింది.
ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి.. వైసీపీ నేతతో చేతులు కలపడంతో విజయనగరం జిల్లాలో వైసీపీ 5 జడ్పీటీసీలతోపాటు 101 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించినట్లు టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన మరో మంత్రి పట్టుదలకు పోయి కూటమి అభ్యర్థిని ఓటమి అంచులదాకా తీసుకెళ్లారన్న ఆరోపణ కూడా ఉంది. వీటన్నిటిపై సమగ్ర నివేదికలు తెప్పించుకునే పనిలో టీడీపీ పెద్దలు నిమగ్నమయ్యారు.
4 కోణాల్లో నివేదికలు
ప్రాంతీయ సమన్వయకర్తలకు లోకేశ్ నిర్దేశం
స్థానిక ఎన్నికల పోస్టుమార్టంపై మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రెండ్రోజుల కిందట ప్రాంతీయ సమన్వయకర్తలతో మాట్లాడారు. ఆయా చోట్ల ఏ కారణాలతో వైసీపీ గెలిచిందో అధ్యయనం చేసి నివేదికలివ్వాలని ఆదేశించినట్లు సమాచారం. క్యాడర్ మనోభావాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల ఓటమి పాలైన స్థానాలు.. ఎమ్మెల్యేల పనితీరు కారణంగా ఓడిపోయిన స్థానాలు.. కూటమి నేతల నడుమ సమన్వయ లోపంతో కోల్పోయిన సీట్లు, వైసీపీ సంస్థాగతంగా బలంగా ఉండి గెలిచిన స్థానాలు.. ఇలా నాలుగు కోణాల్లో రిపోర్టులివ్వాలని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు