Share News

రెబల్స్‌.. ఎమ్మెల్యేల చలవే!

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:57 AM

రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పలు చోట్ల టీడీపీ రెబల్స్‌ బరిలో నిలిచారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి సీట్లు కేటాయించాల్సిన ఎమ్మెల్యేలు.. తమకు నచ్చిన వారిని బరిలోకి దింపుతుండడంతో చాలాచోట్ల రెబల్స్‌ బరిలో దిగారు.

రెబల్స్‌.. ఎమ్మెల్యేల చలవే!

  • అధినేత చంద్రబాబు ఆదేశాలు సైతం బేఖాతర్‌

  • మీరే జడ్పీ చైర్మన్‌ అంటూ కొందరికి హామీలు

  • పార్టీ కోసం పనిచేసినవారికి మొండిచేయి

  • కృష్ణా జిల్లాలో ఎన్‌ఆర్‌ఐని దింపిన ఎమ్మెల్యే

  • కొన్నిచోట్ల మిత్రుల స్థానాల్లో నామినేషన్లు

  • ఇంకొన్నిచోట్ల ఉదాసీనంగా శాసనసభ్యులు

  • మరికొన్ని స్థానాల్లో టీడీపీ బరిలో ఉన్నా..

  • జనసేన, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు

  • తాజా పరిణామాలపై సీఎంతో పవన్‌, మాధవ్‌

  • చర్చలు.. ఉండవల్లి నివాసంలో వేర్వేరుగా భేటీ

  • రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యత కమిటీకి

కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వయింది. ఈ పదవి కోసం టీడీపీలో ఏనాటి నుంచో పనిచేస్తున్న ముగ్గురు నేతలు పోటీ పడ్డారు. కానీ వీరిని కాదని జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకు నచ్చినవారిని జడ్పీటీసీ అభ్యర్థులుగా దింపారు. చైర్మన్‌ పీఠం మీదేనంటూ హామీ కూడా ఇచ్చేశారు. వీరిలో ఒకరు అసలు పార్టీలో క్రియాశీలంగానే లేరు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఓ ఎన్‌ఆర్‌ఐకి జడ్పీ చైర్మన్‌ సీటును అమ్మేసుకున్నారని స్థానిక ఎమ్మెల్యేపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

ప్రకాశం జిల్లాలో భిన్నమైన పరిస్థితి. ఇక్కడ జడ్పీ చైర్మన్‌ పీఠానికి బాగా డిమాండ్‌ ఉంది. దీంతో ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అభ్యర్థిని మీరే చైర్మన్‌ అంటూ బరిలోకి దింపారు. ఒక ఎమ్మెల్యే మాత్రం జడ్పీ ఎన్నికలతో తనకు సంబంధమే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన తమకు న్యాయం చేయాలని తమకు మద్దతివ్వాలని ఆ నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ అభ్యర్థులు ఆయన్ను అడిగితే.. వచ్చే ఎన్నికల్లో తాను వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతున్నానని, తనను ఇబ్బంది పెట్టవద్దంటూ చేతులు దులిపేసుకున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పలు చోట్ల టీడీపీ రెబల్స్‌ బరిలో నిలిచారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి సీట్లు కేటాయించాల్సిన ఎమ్మెల్యేలు.. తమకు నచ్చిన వారిని బరిలోకి దింపుతుండడంతో చాలాచోట్ల రెబల్స్‌ బరిలో దిగారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వైఖరితో కూటమి అభ్యర్థుల గెలుపే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. రెబల్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామన్న అధినేత హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ చాలా చోట్ల ఎమ్మెల్యేలు తమకు నచ్చినవారిని జడ్పీటీసీలుగా.. ఎంపీటీసీలుగా నిలిపారు.

వారికే పార్టీ బీఫారాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఒంటెత్తు పోకడలు పోతుంటే.. మరికొన్ని చోట్ల వారి ఉదాశీన వైఖరి పార్టీకి నష్టాన్ని కలిగించేలా ఉంది. కూటమి ధర్మాన్ని బీటలు వారుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సోషల్‌ రీ-ఇంజనీరింగ్‌కు పెద్దపీట వేయాలని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చేందుకు స్థానిక ఎన్నికలు మంచి అవకాశమని ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ అధ్యక్షులకు టీడీపీ అధిష్ఠానం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.

కానీ ఎక్కడా వీటిని పాటిస్తున్న దాఖలాలు లేవు. అలాగే కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో ఏయే స్థానాల నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై క్షేత్ర స్థాయిలో నాయకులకు స్పష్టత లేదు. దీంతో చాలాచోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు.


ఎమ్మెల్యేల ఆశీస్సులు.. రెబల్స్‌ జోరు..

  • కృష్ణా జిల్లాలో పార్టీ కోసం జైలుకెళ్లొచ్చిన టీడీపీ మహిళా నేత ఓ జడ్పీటీసీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. అదే స్థానం నుంచి ఎమ్మెల్యే ఆశీస్సులతో మరో నాయకురాలు బరిలో నిలిచారు.

  • ఇదే జిల్లాలో మరో జడ్పీటీసీ స్థానానికి.. చంద్రబాబు అరెస్టు సమయంలో నిరసనలు చేసి కేసులెదుర్కొన్న నేత భార్య నామినేషన్‌ వేయగా.. స్థానిక ఎమ్మెల్యే ఆ శీస్సులతో ఓ ఎన్‌ఆర్‌ఐ బరిలో నిలిచారు.

  • ఈ జిల్లాలో జడ్పీటీసీ స్థానానికి టీడీపీ, జనసేన అభ్యర్థులిద్దరూ బరిలో ఉన్నారు.

  • ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ జడ్పీటీసీ స్థానానికి జనసేన నుంచి మహిళా అభ్యర్థి బరిలో నిలవగా టీడీపీ తరఫున మరో అభ్యర్థి కూడా పోటీకి దిగారు.

  • తిరుపతి జిల్లాలో టీడీపీ నుంచి ఓ కేంద్ర మాజీ మంత్రి కుమార్తె, మాజీ ఎమ్మెల్యే పోటాపోటీగా జడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఆ మాజీ ఎమ్మెల్యే రెండు జడ్పీటీసీల్లో టీడీపీ తరఫున, ఒక చోట జనసేన తరఫున.. నాలుగో స్థానంలో ఈ రెండు పార్టీల నుంచీ నామినేషన్లు వేయడం గమనార్హం.

  • చిత్తూరు జిల్లాలో జడ్పీ చైర్మన్‌ సీటు ఆశిస్తున్న నలుగురు జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. వీరందరూ ఒకే నియోజకవర్గానికి చెందినవారు. అందరూ సీనియర్లే కావడంతో స్థానిక ఎమ్మెల్యేలు ఏమీ చెప్పలేకపోతున్నారు.

  • ఏలూరు జిల్లాలో ఓ జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఒకరు, బీజేపీ తరఫున మరొకరు నామినేషన్‌ వేశారు. ఎవరికీ ఎమ్మెల్యే సర్దిచెప్పలేని పరిస్థితి.

  • పశ్చిమ గోదావరిలోనూ ఓ జడ్పీటీసీ స్థానం నుంచి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బరిలో నిలువగా.. ఆయనకు పోటీగా జనసేన నుంచి మరో అభ్యర్థి దిగారు. ఎవరికి వారు తమ అభ్యర్థిత్వాలను అధిష్ఠానాలు ఖరారు చేస్తాయని ధీమాగా ఉన్నారు. ఈ గొడవ నాకెందుకని స్థానిక ఎమ్మెల్యే గప్‌చు్‌పగా ఉండిపోయారు.

  • బాపట్ల జిల్లాలో ఓ జడ్పీటీసీ స్థానంలో టీడీపీ, టీడీపీ రెబల్‌ పోటీ పడుతుంటే.. మరో జడ్పీటీసీ స్థానంలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదే జిల్లాలో మరో 4 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికీ సర్దిచెప్పలేక అధిష్ఠానం చూసుకుంటుందని వదిలేశారు.


చంద్రబాబుతో పవన్‌, మాధవ్‌ భేటీ

తాజా పరిణామాలతో జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన పవన్‌.. అరగంటపాటు ఆయనతో మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాట్లుపై చర్చించారు. వీటికి నామినేషన్లు వేయడానికి శుక్రవారమే చివరిరోజు కావడం తో.. రెబల్స్‌ ఉన్న చోట్ల వారిని బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఎన్‌డీఏ సమన్వయ కమిటీకి ఆదేశాలివ్వాలని నేతలిద్దరూ నిర్ణయించారు. అనంతరం మధ్యాహ్నం మాధవ్‌ వచ్చి సీఎంను కలిశారు. సీట్ల సర్దుబాటుపై చర్చించారు. కూటమి ధర్మానికి నష్టం కలుగకుండా అభ్యర్థులను నిలపాలని నిర్ణయించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 04:57 AM