Share News

టీడీపీ ఏకగ్రీవాలు!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:43 AM

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయాలు సాధించారు. కొన్ని స్థానాల్లో మునిసిపల్‌ చైర్మన్‌ పోస్టులను కైవసం చేసుకున్నారు.

టీడీపీ ఏకగ్రీవాలు!

  • మునిసిపల్‌ స్థానాల్లో కూటమి పార్టీల హవా

  • సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రకటనలు వాయిదా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయాలు సాధించారు. కొన్ని స్థానాల్లో మునిసిపల్‌ చైర్మన్‌ పోస్టులను కైవసం చేసుకున్నారు. అయితే.. సుప్రీకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటనను వాయిదా వేశారు.

ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌లో మూడు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. అద్దంకి మున్సిపాలిటిలో 3 వార్డులలో టీడీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన 18 డివిజన్లలో అభ్యర్థులను నిలిపింది. బీజేపీ మాత్రం రెండు డివిజన్లలో పోటీ చేస్తోంది.

మార్కాపురం: జిల్లాలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 40 వార్డులకు 125 మంది పోటీలో నిలిచారు. కాగా, 19, 30, 31 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకోవటంతో అవి ఏకగ్రీవమయ్యాయి. వీటిలో రెండు వార్డులు టీడీపీ, ఒకచోట బీజేపీకి దక్కాయి.

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకుగాను 27 వార్డులు టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. తాడిపత్రి మున్సిపాలిటీలోని 48 వార్డులకుగాను 30, కల్యాణదుర్గంలో 12వ వార్డు, హిందూపురంలో 7, 11 వార్డులు, మడకశిరలో 7వ వార్డు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి.

కాకినాడ: కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ 5, 15, 27 వార్డుల్లో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తుని మున్సిపాలిటీలో 32వ వార్డు టీడీపీకి ఏకగ్రీవమైంది.

తూర్పుగోదావరి: కొవ్వూరు మునిసిపాలిటీలో నాలుగు టీడీపీ వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అమలాపురం మున్సిపాలిటీలో 25వ వార్డు నుంచి కురసాల సురేశ్‌ నాయుడు టీడీపీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చిత్తూరు: జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకుగాను 51 ఏకగ్రీవమయ్యాయి. నగరి మున్సిపాలిటీలో 40 వార్డులుండగా 4, పలమనేరులో 36కు గాను 6, కుప్పంలో 32కు 13 ఏకగ్రీవమయ్యాయి.

గుంటూరు: జిల్లాలోని తెనాలి పురపాలక సంఘంలో జనసేన అభ్యర్థి కమ్మెల రజిని ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఆర్వో ప్రకటించారు. మొత్తం 52వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం కావడంతో 51 వార్డుల్లో పోలింగ్‌ జరగనున్నది. తెనాలిలో 86 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో 115 మంది ఎన్నికల పోటీలో ఉన్నారు. వారిలో టీడీపీ 31, కాంగ్రెస్‌ 3, జనసేన 19, బీజేపీ ఒకటి, వైసీపీ 51, సీపీఐ 2, సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు.

ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఒకటి, జగ్గయ్యపేటలో 12, నందిగామలో ఒక వార్డు కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. విజయవాడ కార్పొరేషన్‌లోని 64వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి వీరమాచినేని లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నందిగామ మునిసిపాలిటీలో 8వ వార్డును టీడీపీ అభ్యర్థి ఖరీదు పద్మజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగ్గయ్యపేట 12 వార్డులు ఏకగ్రీవం కాగా వీటిలో 2, 4, 8, 11, 16, 18, 20, 21, 24, 29 వార్డులు టీడీపీ, 3, 5 వార్డులు జనసేనకు ఏకగ్రీవమయ్యాయి.

అనకాపల్లి: జిల్లాలోని నర్సీపట్నం మునిసిపాలిటీలో 40 వార్డులు ఉండగా, 26, 27 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 38 వార్డులకు 84 మంది పోటీలో ఉన్నారు.

విశాఖ: గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) మేయర్‌ పదవికి 15 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం 21 మంది నామినేషన్లు వేయగా వారిలో ఆరుగురు ఉపసంహరించుకున్నారు. కూటమి తరపున ముక్కా శ్రావణి(టీడీపీ), వైసీపీ అభ్యర్థినిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బరిలో ఉండగా, వీరితో పాటు కాంగ్రెస్‌ నుంచి డి. సునందా దేవి, భారత చైతన్య యువజన పార్టీ తరఫున నమ్మి భవానీ, బీఎస్పీ నుంచి కరణం కీర్తన గ్రేస్‌ పోటీ చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీ 28 వార్డులకుగాను తొమ్మిది చోట్ల ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే మిగలారు. దీంతో వీరంతా ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 19 వార్డుల్లో 41 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు మిగిలారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 04:43 AM