Share News

వైసీపీ ఎమ్మెల్యే గుప్పిట్లో 7 గ్రామాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:36 AM

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ నాయకులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంతగ్రామం రాంపురంలో టీడీపీ నాయకుల ప్రచారానికి అడుగడుగునా ఆటంకాలు కలిగేలా వ్యవహరించారు.

వైసీపీ ఎమ్మెల్యే గుప్పిట్లో 7 గ్రామాలు

  • మంత్రాలయం ఎమ్మెల్యే సొంతూరిలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు

  • తలుపులు మూసి బయటకు రాని ప్రజలు

  • నిర్మానుష్యంగా మారిన రాంపురం గ్రామం

మంత్రాలయం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ నాయకులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంతగ్రామం రాంపురంలో టీడీపీ నాయకుల ప్రచారానికి అడుగడుగునా ఆటంకాలు కలిగేలా వ్యవహరించారు. దీంతో భారీ పోలీస్‌ బందోబస్తుతో టీడీపీ నేతలు జడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే అక్కడ ప్రజలు ఇళ్లకు తలుపులు వేసుకుని బయటకు రాకపోవడంతో టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. మంత్రాలయం మండలంలోని ఎమ్మెల్యే సొంత గ్రామమైన రాంపురంలోని గ్రామ చావిడి వద్ద జడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, బీజేపీ ఎన్నికల పరిశీలకుడు మురళినాయుడు పూజలు చేసి ఐదు ఇళ్లు తిరిగి కరపత్రాలను పంచారు.

అనంతరం, దిబ్బనదొడ్డి గ్రామానికి వెళ్లి ప్రచారం చేపట్టారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి సొంత గ్రామమైన 52-బసాపురంలో కూటమి నాయకుల వాహనాలు రాకుండా వైసీపీ నాయకులు రోడ్డుకు అడ్డంగా రెండు చోట్ల కట్టెల మొద్దులను అడ్డు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డంగా పెట్టిన మొద్దులను తొలగించారు. టీడీపీ శ్రేణులు ప్రచారానికి వస్తారని తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.. తన ఆధీనంలోని రాంపురం, దిబ్బనదొడ్డి, 52-బసాపురం గ్రామాల్లో ప్రజలు బయటికి రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో ఆ గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. బయటికి వచ్చిన ఒకరిద్దరి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంచిన టీడీపీ అభ్యర్థి లక్ష్మయ్య.. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దాదాపు 170 మంది పోలీసుల భారీ భద్రతల నడుమ ప్రచారం చేపట్టారు.


వైసీపీ నేతదే హవా

ఆయా గ్రామాల్లో ఏళ్ల తరబడి వైసీపీ నేత హవా చలాయిస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఇతర పార్టీల నాయకులు వెళ్లి ప్రచారం చేయకుండా అడ్డుపడుతున్నారన్న చర్చ కూడా ఉంది. అయితే.. ఆ 7 గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టాలని టీడీపీ అధిష్ఠానం ఆదేశించడంతో 4 మండలాల నుంచి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి ప్రచార రథం పైనుంచి మాట్లాడుతూ.. మార్పుకోసం ఒక అడుగు ముందుకు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా స్వేచ్చగా తిరగలేని వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కూటమి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గుప్పిట్లో ఉన్న ఏడు గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, అవకాశం కల్పించాలని కోరారు. మాధవరం నుంచి రాంపురం, తులంగభద్ర, దిబ్బనదొడ్డి, బసాపురం గ్రామాల్లో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 01:36 AM