విధేయతకు జై
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:49 AM
పార్టీని నమ్ముకున్న వారికి పెద్దపీట! సామాజిక సమీకరణకు ప్రాధాన్యం! భవిష్యత్తులో పార్టీని నడిపించాల్సిన యువతకు పదవుల పట్టం! జిల్లా పరిషత్ సారథుల ఎంపికలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన సమ్మిళిత సూత్రమిది!
జడ్పీల్లో యువతకు అందలం
పార్టీని నమ్ముకున్నవారికి టీడీపీ పెద్దపీట
ఉలిగయ్య, కోట పుల్లమ్మ, సుగవాసి ప్రసాద్‌బాబు,రామకృష్ణంరాజుకు దక్కిన జడ్పీ పదవులు
భావి నాయకత్వం కోటాలో పరిటాల శ్రీరామ్, చింతమనేని నవ్యశ్రీ, గొల్లపల్లి అమూల్య, సాదిక షేక్, కీర్తన, పూజిత కూడా..
సోషల్ రీ-ఇంజనీరింగ్‌తో కొందరికి అనూహ్యంగా పదవులు
తూర్పున కాదా పద్మ, నంద్యాలలో బృహానుద్దీన్, పల్నాడులో రమాదేవికి చాన్స్
చైర్పర్సన్ ఆశించినవారికి ఉపాధ్యక్ష పదవులు
కాకినాడలో పిల్లి అనంతలక్ష్మి అసంతృప్తి
దీంతో వైస్‌చైర్‌పర్సన్‌గా పంపన రాజేశ్వరీదేవి
(అమరావతి - ఆంధ్రజ్యోతి): పార్టీని నమ్ముకున్న వారికి పెద్దపీట! సామాజిక సమీకరణకు ప్రాధాన్యం! భవిష్యత్తులో పార్టీని నడిపించాల్సిన యువతకు పదవుల పట్టం! జిల్లా పరిషత్ సారథుల ఎంపికలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన సమ్మిళిత సూత్రమిది! రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లా సారథులు కొలువు తీరారు. కూటమి పార్టీల మధ్య సర్దుబాటులో భాగంగా 22 జిల్లాల్లో టీడీపీకి చెందిన నేతలు శుక్రవారం జడ్పీ చైర్పర్సన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి ఎంపికలో టీడీపీ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. పార్టీపట్ల విధేయతకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారికి పదవులు కేటాయించి న్యాయం చేసింది.
అదే సమయంలో భవిష్యత్ నాయకత్వాన్ని తయారుచేసే విధంగా యువతకూ పదవుల్లో సముచిత స్థానం కల్పించింది. సోషల్ రీ-ఇంజనీరింగ్‌లో భాగంగా జనాభా దామాషా ఆధారంగా అందరికీ పదవులు దక్కాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనతో కొందరు అనూహ్యంగా తెరపైకి వచ్చి పదవులు దక్కించుకున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించాల్సి రావడంతో కొన్ని స్థానాల్లో చైర్మన్ పదవులు ఆశించినవారు తప్పనిసరై వైస్ చైర్మన్ స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
విధేయులకు దక్కిన అందలం
పోలవరం జడ్పీ చైర్పర్సన్, అడ్డతీగల జడ్పీటీసీ వంతల రాజేశ్వరి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా పార్టీ కోసం నిలబడి పనిచేశారు. ఆమె విధేయతకు మెచ్చి పార్టీ పెద్దలు జడ్పీ పదవి ఇచ్చారు. తూర్పు గోదావరి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కాడ పద్మ కుటుంబం కూడా తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని ఉంది. పశ్చిమగోదావరి జడ్పీ చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు కూడా పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఎన్టీఆర్ జడ్పీ చైర్పర్సన్ కోట పుల్లమ్మ కుటుంబమూ పార్టీనే నమ్ముకుని ఎదుగుతూ వచ్చింది.
అన్నమయ్య జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్‌బాబు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీనే నమ్ముకుని ఉన్నందుకు జడ్పీ చైర్మన్ పదవి దక్కింది. కర్నూలు జడ్పీ చైర్మన్ చూడి ఉలిగయ్య టీడీపీ ఆవిర్భావం నుంచీ కొనసాగుతూ పార్టీ పెద్దల గుర్తింపు పొందారు. అనంతపురం జడ్పీ చైర్మన్ గంజే నాగరాజు, తిరుపతి జడ్పీ చైర్పర్సన్ కఠారి హేమలత, చిత్తూరు జడ్పీ చైర్పర్సన్ మందలపు శైలజ కూడా విధేయులుగా ఉంటూ పదవులు దక్కించుకున్నారు. హేమలత సత్యవేడు మాజీ ఎమ్మెల్యే కూడా.
యువ నాయకులు, వారసులు
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) కుమార్తె సిరిసహస్ర విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కోనసీమ జడ్పీ చైర్పర్సన్ గొల్లపల్లి అమూల్య, ఏలూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సాయినవ్యశ్రీ పెదవేగి జడ్పీటీసీగా గెలిచారు. ఈమె దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె. శ్రీసత్యసాయి జడ్పీ చైర్మన్ పరిటాల శ్రీరామ్, కృష్ణా జడ్పీ వైస్ చైర్పర్సన్ దండమూడి పూజిత, పల్నాడు జడ్పీ వైస్ చైర్పర్సన్ నల్లపాటి కీర్తన, కర్నూలు జడ్పీ వైస్ చైర్పర్సన్ సాదిక షేక్.. జడ్పీ పదవులు దక్కించుకున్న వారిలో పిన్నవయస్కులు.
భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడంలో భాగంగా టీడీపీ అధిష్ఠానం వీరికి పదవులు ఇచ్చింది. వీరిలో పరిటాల శ్రీరామ్.. పరిటాల రవి, సునీత దంపతుల కుమారుడన్న సంగతి తెలిసిందే. ఇక అమూల్య మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె. ఒకప్పుడు టీడీపీలో ఉన్న ఈయన ప్రస్తుతం వైసీపీ రాజోలు ఇన్చార్జి. ఇంతవరకు అమూల్య కూడా అదే నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. నంద్యాల జడ్పీ చైర్మన్ షేక్ బృహానుద్దీన్, పల్నాడు జడ్పీ చైర్పర్సన్ పుచ్చకాయల రమాదేవి, తూర్పుగోదావరి జడ్పీ సారథి కాదా పద్మ సామాజిక సమీకరణల్లో భాగంగా అనూహ్యంగా తెరపైకి వచ్చి పదవులు దక్కించుకున్నారు.
పెద్ద పదవి ఆశిస్తే ‘ఉప’పదవి..
పార్వతీపురం మన్యం జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆశించిన కురుపాం జడ్పీటీసీ వీరేశ్ చంద్రదేవ్‌కు నిరాశే ఎదురైంది. ఈ జడ్పీని జనసేనకు కేటాయించడంతో టీడీపీ నాయకత్వం ఆయనకు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. కాకినాడ జడ్పీ చైర్మన్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కాకినాడ రూరల్ జడ్పీటీసీ పిల్లి అనంతలక్ష్మికి వైస్ చైర్మన్ స్థానాన్ని కేటాయించారు. అయితే ఆ స్థానాన్ని ఆమె తీసుకునేందుకు అయిష్టత చూపడంతో ఆమె స్థానంలో పంపన రాజశ్వేరీదేవిని టీడీపీ పెద్దలు నియమించారు.
కృష్ణా జడ్పీ పీఠం కోసం టీడీపీ నుంచి కంకిపాడు జడ్పీటీసీ దండమూడి పూజిత చివరి వరకు ప్రయత్నించారు. ఈమె కృష్ణా జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు దండమూడి చౌదరి భార్య. పొత్తులో భాగంగా బీజేపీకి ఈ జడ్పీ ఇవ్వడంతో పూజితకు వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టారు. పల్నాడు జడ్పీ చైర్మన్ కోసం గట్టిగా ప్రయత్నించిన నల్లపాటి కీర్తన కూడా ఉపాధ్యక్ష స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కర్నూలు జడ్పీ చైర్పర్సన్ రేసులో ఉన్న షేక్ సాదిక, నంద్యాల జడ్పీ చైర్మన్ ఆశించిన కె.శ్రీకాంత్రెడ్డిదీ ఇదే పరిస్థితి.
పవన్ నిర్ణయం.. నలుగురు చైర్మన్ల ప్రమాణం
8 ఐదుగురు ఉపాధ్యక్షులు కూడా..
కూటమి పార్టీల నడుమ పొత్తులో భాగంగా నాలుగు జడ్పీ చైర్పర్సన్. ఐదు ఉపాధ్యక్ష పదవులను జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తన కోటా చైర్మన్లు, వైస్చైర్మన్ల పేర్లను టీడీపీ నాయకత్వం ప్రకటించింది. జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ఆయా పదవులు చేపట్టేవారి పేర్లను ఖరారుచేశారు. ఆ వెంటనే వారు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎల్ఎన్ పేట జడ్పీటీసీ కొరికాన భవానిని ఎంపిక చేశారు.
అనకాపల్లి జడ్పీ పీఠానికి పరవాడ జడ్పీటీసీ మోటూరు నాగమణి, కాకినాడ జడ్పీ చైర్‌పర్సన్‌గా పెద్దాపురం జడ్పీటీసీ బుర్రా దివ్య సునీతరాజ్లను ఖరారుచేశారు. తూర్పుగోదావరి జిల్లా జడ్పీ ఉపాఽధ్యక్షురాలిగా నిడదవోలు జడ్పీటీసీ పల్నాటి రజని.. కోనసీమ జిల్లాకు కొత్తపేట జడ్పీటీసీ యెలిశెట్టి రామకృష్ణ, బాపట్లకు పర్చూరు జడ్పీటీసీ కల్వకూరి పిచ్చమ్మ, ప్రకాశం జిల్లాకు దర్శి జడ్పీటీసీ వరికూటి లక్ష్మీ తాయారు, శ్రీసత్యసాయి జిల్లాకు గోరంట్ల జడ్పీటీసీ దాసరి సునేత్రను వైస్ చైర్పర్సన్లుగా పవన్ ఎంపిక చేశారు. శుక్రవారం ఉదయమే వీరందరి పేర్లు ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి