Share News

ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:45 AM

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పురపాలక సంఘాలన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే అనంతపురం కార్పొరేషన్‌ మాత్రం వైసీపీ ఖాతాలో పడింది.

ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

  • కార్పొరేషన్‌ మాత్రం వైసీపీ పరం

అనంతపురం, పుట్టపర్తి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పురపాలక సంఘాలన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే అనంతపురం కార్పొరేషన్‌ మాత్రం వైసీపీ ఖాతాలో పడింది. ఆ పార్టీ అభ్యర్థి చిట్లూరు రమేశ్‌గౌడ్‌ విజయం సాధించారు. అయితే ఇక్కడి 62 వార్డులకు గాను టీడీపీ 31, జనసేన 6, బీజేపీ 1 (మొత్తం 38) మెజారిటీ వార్డులు దక్కించుకున్నాయి. వైసీపీ 20 మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ కూటమి పార్టీల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇక శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి చైర్మన్‌గా జనసేన అభ్యర్థి మేకల ఈశ్వర్‌ గెలిచారు.

మడకశిర నగర పంచాయతీలో జనసేన అభ్యర్థి గుండుమల శారద, పెనుకొండలో టీడీపీ అభ్యర్థి త్రివేంద్రమూర్తి, హిందూపురంలో టీడీపీ అభ్యర్థి పురిడి మంజునాథ్‌, కదిరిలో టీడీపీ అభ్యర్థి షేక్‌ ఆర్షియా బాను, ధర్మవరంలో టీడీపీ అభ్యర్థి పరిశె సుధాకర్‌ గెలుపొందారు. అనంతపురం జిల్లా గుత్తి చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన గోవిందరాజుల తమిళసెల్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి ఆర్‌.యశోద గౌడ్‌, కల్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి బుట్నా లక్ష్మి, రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి టెంకశాల హనుమంతు, తాడిపత్రిలో టీడీపీకే చెందిన రేష్మా పర్వీన్‌ చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. గుత్తిలోని మొత్తం 32 వార్డులూ కూటమికే దక్కాయి.

వీటిలో 29 టీడీపీకి, జనసేనకు 2, బీజేపీకి ఒకటి దక్కాయి. గుంతకల్లు వార్డుల్లో వైసీపీ గట్టి పోటీయే ఇచ్చింది. 48 వార్డులకు గాను 15 దాని ఖాతాలో పడ్డాయి. టీడీపీ 24, బీజేపీ 1 గెలుచుకున్నాయి. 8 మంది స్వతంత్రులు గెలిచారు. తాడిపత్రిలోని 48 వార్డులూ కూటమికే దక్కాయి. వైసీపీకి ఒక్కటి కూడా రాలేదు. కదిరి, మడకశిర, పెనుకొండల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు.


జనసేన టికెట్‌ దక్కక..

ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీటు పొత్తులో భాగంగా టీడీపీకి దక్కింది. ఆ పార్టీ తరఫున టి.మణి బరిలోకి దిగారు. జనసేన ఇన్‌చార్జి మల్లప్ప తన భార్య స్వప్న నాయకర్‌ను స్వతంత్ర అభ్యర్థిగా నిలిపారు. 52 వార్డులకు గాను టీడీపీ 30 చోట్ల గెలిచినా మణి గెలవలేకపోయారు. స్వప్నకు అనుకూలంగా క్రాస్‌ఓటింగ్‌ జరిగింది. డోన్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ (ఫాతిమాబీ) విజయం సాధించింది. 32 వార్డులకు గాను 23 వైసీపీకి దక్కాయి.

టీడీపీ 9తో సరిపుచ్చుకుంది. బేతంచెర్ల నగర పంచాయతీలో టీడీపీ ఎదురీదుతోంది. వైసీపీ అభ్యర్థి దస్తగిరి.. టీడీపీకి చెందిన లోకేశ్‌ గౌడ్‌పై ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ 18, టీడీపీ 10 వార్డులు దక్కించుకున్నాయి. ఆత్మకూరులో టీడీపీ 18, బీజేపీ, జనసేన చెరొకటి, వైసీపీ 9 చోట్ల విజయం సాధించాయి. చైర్‌పర్సన్‌గా టీడీపీ తరఫున గోవిందరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాలలో మంగళవారం అర్ధరాత్రి కడపటి వార్తలు అందేసరికి.. టీడీపీ అభ్యర్థి బాబన్‌ ముందంజలో ఉన్నారు. 52 వార్డుల్లో టీడీపీ-25, వైసీపీ-27 గెలుపొందాయి. బాబన్‌కు అనుకూలంగా క్రాస్‌ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 06:45 AM