Share News

ప్రకాశంలో క్లీన్‌ స్వీప్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:12 AM

పుర సమరంలో కూటమి ప్రభంజనం కొనసాగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్లీన్‌స్వీ్‌ప్ చేసింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు.

ప్రకాశంలో క్లీన్‌ స్వీప్‌

  • ఒక కార్పొరేషన్‌, 4 మున్సిపాలిటీల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు

  • ఒంగోలు మేయర్‌గా శ్రీశిల్ప గెలుపు

  • దర్శి, మార్కాపురం చైర్మన్‌ స్థానాల్లో జనసేన, బీజేపీ అభ్యర్థుల జయకేతనం

ఒంగోలు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పుర సమరంలో కూటమి ప్రభంజనం కొనసాగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్లీన్‌స్వీ్‌ప్ చేసింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మేయర్‌, అద్దంకి, చీమకుర్తి, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులతోపాటు మెజారిటీ వార్డులు టీడీపీ ఖాతాలో పడ్డాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కనిగిరి తెలుగుదేశం ఖాతాలోకి, గిద్దలూరు బీజేపీ ఖాతాలోకి చేరాయి. ఒంగోలు మేయర్‌గా టీడీపీ అభ్యర్ధి శ్రీశిల్ప ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో ఆమెకు 82,674 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌కు 45,048 ఓట్లు దక్కాయి. 60 డివిజన్లలో 48 కూటమి, 5 చోట్ల జనసేన, ఒక చోట బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మరో ఇద్దరు టీడీపీ, ఇద్దరు జనసేన రెబల్‌ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. వైసీపీ 11 డివిజన్లలో, స్వతంత్ర అభ్యర్థి ఒకటి గెలుపొందారు.


అద్దంకిలో అఖండ విజయం

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మున్సిపాలిటీలో టీడీపీ అఖండ విజయం సాధించింది. చైర్మన్‌గా పోటీ చేసిన అశోక్‌కు 7,493 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తం 32 వార్డులలో టీడీపీ 25, జనసేన 4, టీడీపీ రెబల్‌ ఒకచోట గెలుపొందారు. వైసీపీ 2 వార్డులకే పరిమితమైంది. చీమకుర్తిలో టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి శిద్దా సుధాకర్‌ 3,078 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 28 వార్డులలో టీడీపీ 21 చోట్ల, 2 చోట్ల జనసేన. వైసీపీ 5 వార్డులు దక్కించుకున్నాయి. దర్శి మున్సిపాలిటీ జనసేనకు కేటాయించగా చైర్మన్‌ పదవిని, మొత్తం 32 వార్డులను టీడీపీ, జనసేనలు ఏకగ్రీవం చేసుకున్నాయి.

మార్కాపురంలో..

జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో కూడా టీడీపీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున 16,293 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 40 వార్డులకు గాను కూటమికి 39 లభించగా ఒక్కచోట మాత్రమే వైసీపీ గెలుపొందింది. బీజేపీకి కేటాయించిన గిద్దలూరులో ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ నారాయణ విజయం సాధించారు.28 వార్డుల్లో 22 టీడీపీ, 3 జనసేన,2 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. వైసీపీకి ఒక్కటే దక్కింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:12 AM