Share News

కూటమి ఖాతాలో 12 పట్టణాలు!

ABN , Publish Date - Oct 20 , 2026 | 03:13 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగింది. కూటమి ఖాతాలో 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు చేరనున్నాయి

కూటమి ఖాతాలో 12 పట్టణాలు!
KUTAMI

  • 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఏకగ్రీవం!

  • సొంతగడ్డలో జగన్‌కు ఝలక్‌.. ఉమ్మడి కడప జిల్లాలో

  • కూటమి జోరు.. పులివెందులలో 18 వార్డులు టీడీపీకి

  • కడపలో 64 డివిజన్లు ఏకగ్రీవం.. 2 డివిజన్లకే వైసీపీ పరిమితం

  • మడకశిరలో జనసేన, కనిగిరి, ప్రొద్దుటూరులలో వైసీపీ

  • నామినేషన్ల తిరస్కరణ.. ‘కుప్పం’లో ఒక్క ఏకగ్రీవమూ లేదు!

  • మరో 2 మున్సిపాలిటీల ఏకగ్రీవానికి చాన్స్‌

  • సొంతగడ్డలో జగన్‌కు ఝలక్‌

  • ఉమ్మడి కడప జిల్లాలో కూటమి జోరు

    (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగింది. కూటమి ఖాతాలో 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు చేరనున్నాయి రాయచోటి, రాజంపేట, బద్వేలు, పుంగనూరు, పిడుగురాళ్ల, నగరి, దర్శి, గుత్తి, గురజాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలు కూటమికి ఏకగ్రీవం కానున్నాయి.దర్శి జనసేన ఖాతాలో పడనుండగా, ఇతర మున్సిపాలిటీలు టీడీపీ వశం కానున్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. కనిగిరి, ప్రొద్దుటూరు చైర్‌పర్సన్‌ పదవులు కూడా టీడీపీకి ఏకగీవ్రమయ్యే అవకాశముంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ఇక కమలాపురం, ఎర్రగుంట్ల, దాచేపల్లి నగర పంచాయతీలు కూడా ఏకగ్రీవం కానున్నాయి. వీటిలో ఎర్రగుంట్ల బీజేపీ, కమలాపురం, దాచేపల్లి టీడీపీ ఖాతాలో పడనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు 21వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.


ఉమ్మడి కడపలో జగన్‌కు షాక్‌

వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కు సొంత గడ్డ ఉమ్మడి కడప జిల్లాలో షాక్‌ తగిలింది. కమలాపురం, ఎర్రగుంట్ల, రాజంపేట, రాయచోటి, బద్వేలు చైర్‌పర్సన్‌ స్థానాలు కూటమికి ఏకగ్రీవం కానున్నాయి. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పులివెందులలో 18 వార్డులు, కడప కార్పొరేషన్‌లో 64 డివిజన్‌లు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి. పులివెందులలో మొన్నటిదాకా జగన్‌ ఫ్యామిలీ చెప్పిందే వేదం. అంతా వన్‌సైడ్‌గా ఉండేది. ఇప్పుడు తొలిసారిగా గట్టి పోటీ ఎదురవుతోంది. 40 వార్డులు ఉన్న పులివెందుల మున్సిపాలిటీలో 18 స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన వార్డులకు, చైర్‌పర్సన్‌ పదవికి పోటీ జరగనుంది. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా, రెండు డివిజన్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 64 డివిజన్‌లు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఎర్రగుంట్ల నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా అక్కడ ఆ పార్టీ అభ్యర్థి మధులత ఒక్కరే నామినేషన్‌ వేశారు. బద్వేలు మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలనలో వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి ఒక్కరే పోటీలో ఉండటంతో ఇక్కడ కూడా ఏకగ్రీవం కానుంది. జమ్మలమడుగులో టీడీపీ, వైసీపీ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. కమలాపురం నగర పంచాయతీలో వైసీపీ నుంచి చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ కోసం ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో చైర్‌పర్సన్‌తో పాటు అన్ని వార్డులు కూడా టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి. రాజంపేట మున్సిపాలిటీలో వైసీపీ అభ్యర్థి సరైన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించారు. టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి దొంత గాయత్రి ఏకగ్రీవం కానున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. టీడీపీతో పాటు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా చైర్మన్‌ అభ్యర్థి ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి.


అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మున్సిపాలిటీ టీడీపీకి ఏకగ్రీవం కానుంది. పుంగనూరు మున్సిపాలిటీ కూడా టీడీపీకి ఏకగ్రీవమే. ఇక్కడ పెద్దిరెడ్డి ఆధిపత్యానికి చెక్‌ పడింది.

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 17వ తేదీన నామినేషన్‌ కేంద్రంలోకి గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా ప్రవేశించి 18 మంది అభ్యర్థులకు చెందిన 19 నామినేషన్‌ పత్రాలను చించివేశారు. ఈ ఘటనను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మైదుకూరు మున్సిపాలిటీలోని చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల పదవులకు సాధారణ ఎన్నికల నిర్వహణను ఉత్తర్వులు వెలువడే వరకు తక్షణమే నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్రపునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

చిత్తూరు జిల్లాలోని నగరి మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు నాలుగో వార్డు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి. చైర్మన్‌ స్థానానికి వైసీపీ నుంచి 10 నామినేషన్లు దాఖలు చేయగా, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాలు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో గుత్తి మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం టీడీపీకి ఏకగ్రీవమైంది. టీడీపీ అభ్యర్థిగా గోవిందరాజుల తమిళ సెల్వి నామినేషన్‌ వేశారు. వైసీపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. గుత్తి మున్సిపాలిటీలోని 32 వార్డులకుగానూ 30 వార్డులు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. రెండు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ చైర్మన్‌ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రుల నామినేషన్లను ఆమోదించారు. 48 వార్డులకుగానూ 23 వార్డులు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి.

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన అభ్యర్థి ఎస్‌ఈ శ్రీనివాసులు వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. డమ్మీ అభ్యర్థులుగా ఆయన భార్య సంజీవరత్న, పార్టీ నాయకుడు రామకృష్ణ వేసిన నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఖాళీలను సరిగా పూరించకపోవడంతో తిరస్కరించామని ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో జనసేన లీగల్‌ టీం రంగంలోకి దిగి అధికారులతో మాట్లాడింది.


జనసేన అభ్యర్థి నామినేషన్‌ పత్రాలలో చిన్న పొరపాట్లే ఉన్నాయని, రూల్స్‌ బుక్‌ ప్రకారం వాటి కారణంగా నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని.. జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని ఆ పార్టీ నాయకుడు నవీన్‌ నిశ్చల్‌ మీడియాకు తెలిపారు. ఒకవేళ ఆ నామినేషన్‌ను అంగీకరించకపోతే డమ్మీ అభ్యర్థి, టీడీపీ నాయకుడు రాధాకృష్ణ సతీమణి శారదా రాధాకృష్ణ పేరును జనసేన తరఫున ఖరారు చేసే విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది.

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ జనసేనకు ఏకగ్రీవం కానుంది. చైర్‌పర్సన్‌ రేసులో ఆ పార్టీ అభ్యర్థి ఒక్కరే మిగిలారు.

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన అభ్యర్థి ఎస్‌ఈ శ్రీనివాసులు వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. డమ్మీ అభ్యర్థులుగా ఆయన భార్య సంజీవరత్న, పార్టీ నాయకుడు రామకృష్ణ వేసిన నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఖాళీలను సరిగా పూరించకపోవడంతో తిరస్కరించామని ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో జనసేన లీగల్‌ టీం రంగంలోకి దిగి అధికారులతో మాట్లాడింది. జనసేన అభ్యర్థి నామినేషన్‌ పత్రాలలో చిన్న పొరపాట్లే ఉన్నాయని, రూల్స్‌ బుక్‌ ప్రకారం వాటి కారణంగా నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని.. జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని ఆ పార్టీ నాయకుడు నవీన్‌ నిశ్చల్‌ మీడియాకు తెలిపారు. ఒకవేళ ఆ నామినేషన్‌ను అంగీకరించకపోతే డమ్మీ అభ్యర్థి, టీడీపీ నాయకుడు రాధాకృష్ణ సతీమణి శారదా రాధాకృష్ణ పేరును జనసేన తరఫున ఖరారు చేసే విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది.

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ జనసేనకు ఏకగ్రీవం కానుంది. చైర్‌పర్సన్‌ రేసులో ఆ పార్టీ అభ్యర్థి ఒక్కరే మిగిలారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

Updated Date - Oct 20 , 2026 | 03:18 AM