వైసీపీని ఊడ్చేశారు!
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:38 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో టీడీపీ ప్రభంజనం వీచింది. ముఖ్యంగా నూతన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.
అన్ని జిల్లాల్లో అదే జోరు..!
తిరుపతి, చిత్తూరు నగరాల్లో టీడీపీ పాగా
చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్
తిరుపతి జిల్లాలో నాయుడుపేట తప్ప..
చంద్రబాబు ఇలాకా కుప్పం పసుపుమయం
చైర్మన్, 32 వార్డులూ టీడీపీకే
పెద్దిరెడ్డి అడ్డా పుంగనూరులో వైసీపీకి సున్నా
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో టీడీపీ ప్రభంజనం వీచింది. ముఖ్యంగా నూతన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి మాత్రం వైసీపీ ఖాతాలో పడింది. అయితే ఇక్క డ అధిక వార్డుల(18)లో కూటమి గెలుపొందడం గమనార్హం. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని చిత్తూరు కార్పొరేషన్, కుప్పం, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో మొత్తం 168 డివిజన్లు/వార్డులుండగా.. 74 ఏకగ్రీవమయ్యాయి.
మిగతా 94 డివిజన్లు/వార్డులకు గాను 77 కూటమికే దక్కాయి. మొత్తంగా టీడీపీకి 142, జనసేనకు 6, బీజేపీకి 1 లభించాయి. వైసీపీ 18 చోట్ల గెలిచింది. కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ చైర్మన్ పీఠంతో పాటు మొత్తం 32 వార్డుల నూ సొంతం చేసుకుంది. నామినేషన్ల ప్రక్రియలోనే 13 వార్డులు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. చైర్మన్ స్థానంతోపాటు 19 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఎస్.రాజ్‌కుమార్.. 15,536 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 19 వార్డుల్లో కూడా టీడీపీ అభ్యర్థులే గెలిచారు. వీరిలో ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నారు.
నగరి 40 వార్డులకు గాను ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 31, జనసేన 1 గెలుచుకున్నాయి. వైసీపీ 7, ఒక చోట ఇతరులు గెలిచారు. పలమనేరులో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి 3,475 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ 36 వార్డులకు గాను టీడీపీ 26, జనసేన 2, వైసీపీ 7 దక్కించుకున్నాయి.
అన్నమయ్య జిల్లాలో కూటమి జోరు
అన్నమయ్య జిల్లా రాయచోటి, పుంగనూరు, మదనపల్లె మున్సిపాలిటీల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా పుంగనూరులో వైసీపీ ఒక్క స్థానం కూడా సాధించలేకపోయింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నయీం తాజ్(టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడి 36 వార్డుల్లో 32 ఏకగ్రీవం కాగా.. మిగతా 4 వార్డులకు మాత్రమే పోలింగ్ జరిగింది. వీటిలో 3 వార్డుల్లో టీడీపీ, ఒకటి సీపీఐ గెలుపొందాయి.
రాయచోటిలో చైర్మన్ పదవితో పాటు 44 వార్డులనూ ఏకగ్రీవంగా కూటమి గెలుచుకుంది. మదనపల్లె టీడీపీ చైర్మన్ అభ్యర్ధి శ్రీరామ్ చినబాబు 9644 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 48 వార్డులు ఉండగా.. ఒక స్థానాన్ని టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో.. 47 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీకి 21, జనసేన 6, బీజేపీ 4, వైసీపీ 12, బీఎస్పీకి 1 రాగా.. స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు.
తిరుపతి జిల్లాలో టీడీపీకి 1+3
తిరుపతి జిల్లాలో తిరుపతి కార్పొరేషన్, వెంకటగిరి, సూళ్లూరుపేట, పుత్తూరు మున్సిపాలిటీలు టీడీపీ వశమయ్యాయి. తిరుపతి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు వైసీపీ అభ్యర్థి వాసుదేవ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. మొత్తం 66 డివిజన్లకు రెండు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 స్థానాల్లో.. టీడీపీకి 36, జనసేన 19, బీజేపీ 3.. మొత్తం 58 స్థానాలు సాధించాయి. మిగిలిన ఆరింటిలో వైసీపీ 3 మాత్రమే దక్కా యి. గెలిచిన ముగ్గురు స్వతంత్రులూ టీడీపీ, జనసేన రెబల్సే. వెంకటగిరిలో చైర్‌పర్సన్ స్థానం సహా 32 వార్డుల్లో కూటమి విజయం సాధించింది.
టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి దొంతు శారద.. 10,636 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ కేవలం 4 వార్డులకే పరిమితమైంది. సూళ్లూరుపేటలో చైర్‌పర్సన్ స్థానంతో పాటు 32 వార్డుల్లో 29 స్థానాలను కూటమి గెలుచుకుంది. వైసీపీ 3 వార్డులతో సరిపెట్టుకుంది. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పిట్ల సుహాసిని 8728 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పుత్తూరు మున్సిపాలిటీలో కూట మి ఏకపక్షంగా గెలిచింది. ఇక్కడ జనసేనకు చెందిన చైర్‌పర్సన్ అభ్యర్థి ఏలుమలై 10,213 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం 36 వార్డుల్లో టీడీపీకి 30, జనసేన 2 చోట్ల గెలిచాయి. వైసీపీ 4 వార్డులకే పరిమితమైంది.
టీడీపీలో వర్గపోరు కారణంగా నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పార్టీ చేజారింది. వైసీపీ అభ్యర్థిని తంబిరెడ్డి రాజేశ్వరమ్మ గెలిచారు. అయితే వార్డుల్లో టీడీపీ 14, బీజేపీ 4 చోట్ల విజయంసాధించాయి. వైసీపీ 13 వార్డుల్లో గెలుపొందగా.. జనసేన రెబల్ ఒక వార్డులో విజయం సాధించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం