Share News

నిజంగానే.. ‘స్వర్ణ’ పంచాయతీలు!

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:57 AM

ఒక ‘సాప్ట్‌వేర్‌’ గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చింది. గ్రామ పంచాయతీల జవాబుదారీతనం పెంచడంతోపాటు, ఆదాయాన్ని ఏకంగా రెట్టింపు చేసింది. అదే.. ‘స్వర్ణ పంచాయతీ పోర్టల్‌.’ ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన సరికొత్త పోర్టల్‌ ఇది!. గ్రామీణ ప్రాంతాల్లో పన్ను ఎగవేతదారులకు ఈ పోర్టల్‌ సింహస్వప్నంగా మారింది.

నిజంగానే.. ‘స్వర్ణ’ పంచాయతీలు!

  • పల్లెల ఆదాయం పెంచిన పోర్టల్‌

  • రెట్టింపైన పంచాయతీల ఆదాయం

  • డిజిటల్‌ విధానంలో పన్నుల వసూళ్లు

  • ఖర్చులపై మూడు దశల్లో నియంత్రణ

  • దుర్వినియోగం, బాధ్యతారాహిత్యానికి చెక్‌

  • 13,351 పంచాయతీలకు డిజిటల్‌ దన్ను

  • సాకారమైన ఉప ముఖ్యమంత్రి ఆలోచన

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఒక ‘సాప్ట్‌వేర్‌’ గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చింది. గ్రామ పంచాయతీల జవాబుదారీతనం పెంచడంతోపాటు, ఆదాయాన్ని ఏకంగా రెట్టింపు చేసింది. అదే.. ‘స్వర్ణ పంచాయతీ పోర్టల్‌.’ ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన సరికొత్త పోర్టల్‌ ఇది!. గ్రామీణ ప్రాంతాల్లో పన్ను ఎగవేతదారులకు ఈ పోర్టల్‌ సింహస్వప్నంగా మారింది. పన్నుల అసె్‌సమెంట్‌ పరిధిలోకి రాని వేలాది ఆస్తులు ఈ పోర్టల్‌ కారణంగా పన్నుల పరిధిలోకి వచ్చాయి. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రోత్సాహంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ కసరత్తు చేసి రూపొందించిన ఈ వెబ్‌పోర్టల్‌ గ్రామీణ ప్రాంతాల ఆదాయ వనరుల పెంపునకు దన్నుగా మారింది. గతంలో లోపభూయిష్టంగా ఉన్న పన్నుల వ్యవస్థను గాడిన పెట్టింది. తప్పుచేసిన అధికారులు కమిషనరేట్‌ వద్దకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకునేలా చేసింది.


సమగ్రడిజిటల్‌

ఈఆర్‌పీ

గ్రామ పంచాయతీల పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు స్వర్ణ పంచాయతీల పేరిట సమగ్ర డిజిటల్‌ ‘ఈఆర్‌పీ’ వేదికను రూపొందించారు. పంచాయతీల ఆదాయం, వసూళ్లు, వ్యయాలు, పౌరసేవలు, రికార్డుల నిర్వహణ, ఉద్యోగుల సంబంధిత ప్రక్రియలు, సమావేశాలు, ఆర్థిక నివేదికలు తదితరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రామ పంచాయతీలు స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా పన్నులు, పన్నేతర ఆదాయాల వసూళ్లు, వివిధ పౌరసేవల నిర్వహణ, అభివృద్ధి పనులు, కొనుగోళ్లు, వేతనాలు, ఇతర ఖర్చులు, ఆర్థిక రికార్డుల నిర్వహణ వంటి విస్తృత బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు వీటిలో అనేక ప్రక్రియలు భౌతిక రికార్డుల ఆధారంగా సాగడంతో జాప్యం, సమాచార విభజన, ఆర్థిక వ్యవహారాలపై తక్షణ పర్యవేక్షణ లోపించడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్‌పీ)ని అభివృద్ధి చేశారు. పంచాయతీల సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేయడం, ప్రక్రియలను ఆటోమేట్‌ చేయడం, బహుళ చెల్లింపు మార్గాలను అందుబాటులోకి తేవడం, లాగిన్‌ సదుపాయం వంటివి కల్పించారు. రియల్‌టైమ్‌ ఆర్థిక డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేశారు.


డిజిటల్‌గా వసూళ్లు..

స్వర్ణ పంచాయతీలో గ్రామ పంచాయతీల స్వీయ ఆదాయ వనరుల(ఓఎస్ఆర్‌) నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇంటి పన్ను, వివిధ ఫీజులు, వేలాలు, సర్టిఫికెట్లు, డిపాజిట్లు, విరాళాలు, స్థానిక ఉత్పత్తుల విక్రయం తదితర ఆదాయ వనరులను డిజిటల్‌ విధానంలో నిర్వహించవచ్చు. ఇకపై డిమాండ్‌ సృష్టి ప్రక్రియను ఆటోమేట్‌ చేయనున్నారు. డిమాండ్‌ నోటీసులను వాట్సాప్‌, మనమిత్ర, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు పంపుతున్నారు.

పలు మార్గాల్లో చెల్లింపులు..

గ్రామీణుల పన్నులు, ఇతర బకాయిలను నగదు రహితంగా చెల్లించేందుకు పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌, నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, ఆన్‌లైన్‌ చెల్లింపులు, ఇతర బ్యాంకింగ్‌ మార్గాలు, అవసరమైన చోట చలానాల ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో నగదు సేకరణ, అనంతరం బ్యాంకులో జమ చేసే మాన్యువల్‌ విధానం తగ్గుతుంది. పన్నుల చెల్లింపులు నిర్దేశిత ట్రెజరీ/పేమెంట్‌ వ్యవస్థకు నేరుగా చేరేలా చేయడం వల్ల వసూళ్లను లెక్కల్లో చూపకపోవడం, నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి అవకాశం లేకుండా పోయింది. చెల్లింపులు ప్రారంభమైనప్పటి నుంచి తుది సెటిల్‌మెంట్‌ వరకు ప్రతి లావాదేవీకి డిజిటల్‌ ఆధారం ఉండేలా రూపొందించారు.

ఖర్చులపై నియంత్రణ

పంచాయతీల వ్యయ నిర్వహణలో ‘మేకర్‌-చెకర్‌-అప్రూవర్‌’ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒకే అధికారి ప్రతిపాదన నుంచి చెల్లింపు వరకు మొత్తం ప్రక్రియను నిర్వహించకుండా బాధ్యతలను విభజించారు. పంచాయతీ కార్యదర్శి ప్రతిపాదన(మేకర్‌)- సిస్టమ్‌/సమర్థ అధికారి- పరిశీలన, ధ్రువీకరణ- సర్పంచ్‌/అధీకృత అధికారి- ఆమోదం.. సీఎఫ్ఎంఎస్‌- శాంక్షన్‌ ఆర్డర్‌.. సీఎఫ్ఎంఎస్‌ బిల్‌ లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్‌... తుది ఆమోదం- ఇలా చెల్లింపు ప్రక్రియ సాగుతుంది. పనులు, మెటీరియల్‌ కొనుగోళ్లు, వేతనాలు, కంటింజెంట్‌ ఖర్చులకు సంబంధించి ప్రతిపాదనలను పంచాయతీ కార్యదర్శి ప్రారంభిస్తారు. అనంతరం వస్తువు వారీగా రేట్లు, పరిమితులు, నిబంధనలను సిస్టమ్‌ పరిశీలిస్తుంది.


ఆర్థిక క్రమశిక్షణ!

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2023-24లో రూ.617 కోట్లు ఉంటే 2024-25లో రూ.819 కోట్లకు పెరిగింది. 2025-26 సంవత్సరంలో రూ.1015 కోట్ల కు చేరుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయ లక్ష్యాన్ని సుమారు రూ.1,350 కోట్లుగా నిర్ణయించారు. స్వర్ణ పంచాయతీ కేవలం లెక్కల నిర్వహణ వ్యవస్థగా కాకుండా పౌర కేంద్రిత సేవల వేదికగా పనిచేయనుంది. రాష్ట్రంలో 13,351 గ్రామ పంచాయతీల పరిపాలనకు ఒకే డిజిటల్‌ వ్యవస్థ కీలకంగా మారింది. మొత్తంగా గ్రామ పంచాయతీలను డిజిటల్‌ పాలనా వ్యవస్థగా మార్చడమే స్వర్ణ పంచాయతీల లక్ష్యం.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 03:57 AM