Share News

వాన కురిసె.. పుడమి మురిసె..

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:09 AM

అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో నాట్లు వేసిన వరి పైరు నీటితో కళకళలాడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఆకుమడులు ఎండిపోయి, నాట్లు వేసిన రైతులు కూడా నీరులేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షాలు కురుస్తుండడంతో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.

వాన కురిసె.. పుడమి మురిసె..
దేవరాపల్లి మండలం నాగయ్యపేటలో నాట్లు వేసిన వరి పైరు నీటితో కళకళలాడుతున్న దృశ్యం

- అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు

- సాగుపై చిగురిస్తున్న ఆశలు

- ఇప్పటికే వరినాట్లు వేసిన రైతులకు కాసింత ధీమా

- కూరగాయల పంటలకు మేలు

చోడవరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో నాట్లు వేసిన వరి పైరు నీటితో కళకళలాడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఆకుమడులు ఎండిపోయి, నాట్లు వేసిన రైతులు కూడా నీరులేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షాలు కురుస్తుండడంతో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.

వేసవిని తలపించేలా తీవ్రమైన ఎండలకు మెట్ట ప్రాంతాల్లో పూర్తిగా ఆకుమడులు ఎండిపోయినప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో బోర్లు, కాలువల కింద ఉన్న ఆకుమడులు ప్రస్తుత వర్షాలకు ఒకింత కోలుకునే పరిస్థితి కనిపిస్తున్నది. చోడవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వరినాట్లు పడగా, మిగిలిన చోట్ల బోర్లు ఉన్న ప్రాంతాల్లో వరినాట్లు వేశారు. చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల పరిఽధిలోని కస్పా భూముల్లో పరిమితంగానే వరినాట్లు పడ్డాయి. తీరా నాట్లు వేసిన తరువాత కస్పా కాలువలో నీరు ఎండిపోవడంతో ఆ రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో కాసింతయినా వర్షాలు కురవడంతో తిరిగి పైరు నిలబడుతుందన్న ఆశలు కనిపిస్తున్నాయి. అలాగే సరగుడు తోటలు వేసిన రైతులు కూడా వర్షాలు లేక ఎండిపోతున్న తోటలకు, ట్యాంకర్లతో నీటిని తెప్పించి తోటలను తడుపుకుంటున్నారు. అటువంటి రైతులకు ఈ వర్షం ఊరట ఇచ్చిందని అంటున్నారు,

కూరగాయల రైతులకు మేలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలపై వరి పండించే రైతులకు పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసే రైతులకు కాస్త ఉపశమనం లభించింది. ఇప్పటికే వంగ, బెండ తోటలు వేసిన రైతులకు వర్షం మేలు చేకూర్చే పరిస్థితి ఉండగా, వచ్చే నెలలో మినుములు, బొబ్బర్లు, మొక్కజొన్న పంట వేయాలనుకున్న రైతులకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని అంటున్నారు.

పశుగ్రాసంపై చిగురిస్తున్న ఆశ

కాలువలు, చెరువులు పూర్తిగా అడుగంటిపోవడంతో ప్రస్తుతం గ్రామాల్లో పశువులకు పచ్చగడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. వర్షాలు లేకపోవడంతో పశువులకు పశుగ్రాసం కొరత వేధిస్తున్నది. ఈ పరిస్థితుల నడుమ ప్రస్తుతం కురిసిన వర్షాలకు పచ్చగడ్డి మొలిచే అవకాశం ఉండడంతో పాడి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో మరో అల్పపీడనం కూడా వచ్చే పరిస్థితి ఉందని వాతావరణశాఖ సూచనలపైనా అన్నదాతలు ఆశలు పెంచుకుంటున్నారు. మరికొద్ది రోజులు వర్షాలు ఇదే విధంగా పడితే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 01:09 AM