Share News

రేపే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రజతోత్సవ సంరంభం

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:18 AM

నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రజతోత్సవాలకు సిద్ధమైంది. సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు ముఖ్యఅతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హాజరవుతారని ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ తెలిపారు.

రేపే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌  రజతోత్సవ సంరంభం

  • రేపే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రజతోత్సవ సంరంభం

  • హాజరుకానున్న యూపీ సీఎం యోగి సహా పలువురు ప్రముఖులు

  • పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య మానసపుత్రికగా ఆవిర్భావం

  • పాతికేళ్లలో ఎందరో యువతకు నైపుణ్య శిక్షణ

  • వేలాదిమంది నిరుపేదలకుఉచిత వైద్య సేవలు

  • రెండు తెలుగు రాష్ట్రాలకూ ట్రస్ట్‌ సేవల విస్తరణ

వెంకటాచలం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రజతోత్సవాలకు సిద్ధమైంది. సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు ముఖ్యఅతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హాజరవుతారని ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ తెలిపారు.

రజతోత్సవాలకు ప్రముఖుల హాజరు

సోమవారం జరిగే ట్రస్ట్‌ రజతోత్సవాలకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ స్ఫూర్తి ప్రదాత, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు పొంగూరు నారాయణ, వై.సత్యకుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

ఐదు లక్ష్యాలే ఆలంబన

ట్రస్ట్‌ స్థాపించడం వెనుక కీలకమైన ఐదు లక్ష్యాలు ఉన్నాయి. వాటిలో 1.పేదరికం అక్షరానికి అవరోధం కాకూడదు. 2. గ్రామీణ యువతలో ఆత్మన్యూనత ప్రవేశించకుండా, నైపుణ్యంతో తీర్చిదిద్దాలి. 3. మహిళలు సాధికారతతో, ఆర్థిక ప్రగతితో సగర్వంగా తలెత్తుకు నిలబడాలి. 4. అన్నదాతలు వినూత్న వ్యవసాయ విధానాలు తెలుసుకుని ఆర్ధికంగా బలోపేతం కావాలి. 5. పేదలు ఖరీదైన వైద్యం చేయించుకోగలగాలి


వెంకయ్య ఆలోచన నుంచి ఆవిర్భావం

గ్రామాలకు తిరిగి రండి అంటూ గాంధీజీ ఇచ్చిన పిలుపే స్ఫూర్తిగా రైతులు, మహిళలు, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా 2001లో ఈ ట్రస్ట్‌ను స్థాపించారు. నానాజీ దేశ్‌ ముఖ్‌ చిత్రకూట్‌లో చేపట్టిన గ్రామాభివృద్ధి కార్యక్రమాలే ట్రస్ట్‌ ఏర్పాటుకు స్ఫూర్తి. వెంకయ్యనాయుడు మానసపుత్రికగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ లక్షలాది మంది పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత జీవితాల్లో వెలుగులు నింపింది. ట్రస్ట్‌ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందకుండా, విదేశాల నుంచి నిధులు అందుకోకుండా 24 ఏళ్లుగా సేవలను విస్తరిస్తోంది. ట్రస్ట్‌ ప్రారంభించిన నాటి నుంచి వెంకయ్య మిత్రులు ఈ సంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమార్తె దీపా వెంకట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

ఉచిత వసతి, నైపుణ్య శిక్షణ

దేశం నాకేమిచ్చింది అనే కంటే... నేను దేశానికి ఏమిచ్చాను? అనే ప్రశ్న అందరూ వేసుకుంటే సమసమాజ స్థాపన సాధ్యమ వుతుంది. అదే ఆలోచనతో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఏర్పాటుకు బీజం పడింది. వెంకయ్య స్వగ్రామం చవటపాళెం కాగా, పక్కనే ఉన్న వెంకటాచలం (నెల్లూరు చాప్టర్‌)లో ప్రారంభించిన ట్రస్ట్‌ సేవలు నేడు ఆత్కూర్‌ (విజయవాడ చాప్టర్‌), ముచ్చింతల్‌ (హైదరాబాద్‌ చాప్టర్‌)ల ద్వారా ఉభయ తెలుగు రాష్ర్టాలకు విస్తరించాయి. ఈ ట్రస్ట్‌ ఎంతోమంది నిరుద్యోగ యువతలో ఆత్మస్థయిర్యాన్ని నింపింది. ఉపాధి బాట చూపింది. ఎంతో మంది వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించి ఆయుష్షు పెంచింది. పంటలు లేకపోయినా పాడితో బతుకులీడుస్తున్న రైతుల పశువులకు ఆరోగ్యధీమానిచ్చింది. విద్యను ప్రోత్సహించింది, క్రీడాకారులను, కళాకారులను భుజం తట్టింది. ట్రస్ట్‌ సేవలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల నుంచి శిక్షణార్థులు ఇక్కడ ఉచితంగా వసతితోపాటు నైపుణ్య శిక్షణను అందుకుంటున్నారు. ప్రముఖ ఆస్పత్రుల సహకారంతో ప్రతి వారం వందలాది మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సేవలను ఉచితంగా అందచేస్తోంది.


ప్రముఖుల అభినందనలు

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను సందర్శించి, సంస్థ కార్యక్రమాలను అభినందించారు. గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ ట్రస్ట్‌ను సందర్శించి అందిస్తున్న సేవల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వార్తలను కూడా చదవండి

సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

రెండుగా జడ్పీ

Updated Date - Sep 06 , 2026 | 06:18 AM