అభ్యర్థుల తుది జాబితా 25 వరకు ఆపండి
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:55 AM
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగింపు అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)దే నిర్ణయాధికారమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
నామినేషన్ల గడువుపై ఎస్‌ఈసీదే నిర్ణయాధికారం: సుప్రీం
వైసీపీ ఫిర్యాదు చేసిన చోట్ల నామినేషన్ల పొడిగింపుపై
నేడు నిర్ణయం తీసుకోండి
పొడిగిస్తే 48 గంటల గడువివ్వండి.. ఏపీ ఎన్నికల
సంఘానికి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగింపు అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)దే నిర్ణయాధికారమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే శాంతిభద్రతల సమస్యల వల్ల తమ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని వైసీపీ పేర్కొన్న చోట్ల నామినేషన్ల సమయాన్ని పొడిగించే అంశంపై ఎస్‌ఈసీ గురువారం తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ నామినేషన్ల సమయాన్ని పొడిగించాలని భావిస్తే.. ఆ నిర్ణయాన్ని వెల్లడించిన సమయం నుంచి 48 గంటల పాటు గడువు ఇవ్వాలని తెలిపింది. తమ ఉత్తర్వుల అమలుపై 27వ తేదీన అఫిడవిట్ దాఖలుచేయాలని నిర్దేశించింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదావేసింది. నామినేషన్ల సమయాన్ని ఒకరోజు పొడిగించేందుకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 18న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి 19న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పుంగనూరు, రాయచోటి, కడప, తిరుపతిల్లో హింస చెలరేగిందని.. కడపలో అభ్యర్థి నామినేషన్ కాగితాలు గుంజుకుని చింపేశారని, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 9 మంది అభ్యర్థులను రిటర్నింగ్ అధికారుల ఆఫీసుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పైనా దాడి జరిగిందన్నారు. వీటిపై హైకోర్టును ఆశ్రయించగా భద్రత పెంచాలని ఎస్‌ఈసీని ఆదేశించిందే తప్ప నామినేషన్ల గడువు పొడిగించలేదన్నారు. అడ్డంకుల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు గడువు పొడిగించి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సుప్రీంకోర్టు తుది ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభావితమైన వార్డుల్లో ఏకగ్రీవ ప్రకటనలపై స్టే విధించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించింది. బుధవారం విడుదల చేయాల్సి ఉన్న అభ్యర్థుల తుది జాబితాను నిలిపివేసి.. 25వ తేదీ వరకు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి స్పష్టం చేసింది.
అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు తగిన రక్షణ, పోలీసు బందోబస్తు, సీసీటీవీ కెమేరాలు ఏర్పాటుచేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉన్నందున, తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు మణీందర్‌సింగ్, నిఖిల్ గోయెల్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, ముకుల్ రోహత్గీ, ఏపీ అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది గుంటూరు ప్రభాకర్, ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫున సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్, అమిత్ పాయ్(అడ్వకేట్ ఆన్ రికార్డ్) వాదనలు వినిపించారు.
న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు..
స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయస్థానాల జోక్యానికి అవకాశముందని పేర్కొంటూ సుప్రీంకోర్టు పై ఉత్తర్వులు జారీ చేసింది. ‘స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రం. నామినేషన్లు వేయడం ద్వారా ఎన్నికల్లో పాల్గొనే హక్కు అందులో భాగమే. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ఎస్‌ఈసీకి అప్పగించడం రాజ్యాంగ నిబంధనే అయినప్పటికీ, పోటీ చేసే అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేలా చూడడం కూడా అందులోనే భాగం. అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు రాజ్యాంగ కోర్టులు న్యాయ సమీక్ష అధికారాలను ఉపయోగించకుండా ఉండలేవు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీ అధికారాలను గౌరవిస్తాం. కోర్టుల జోక్యంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోకుండా.. అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల కమిషన్‌కు బాధ్యత అప్పగించారు.
అయితే అదే సమయంలో, రాజ్యాంగ విలువలకు రక్షకులు రాజ్యాంగ కోర్టులేనన్న విషయాన్ని విస్మరించలేం. అక్రమాలు, చట్టవిరుద్ధ చర్యల వల్ల ఎన్నికలు దెబ్బతినే పరిస్థితి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోవు. పిటిషనర్ పార్టీతోపాటు అభ్యర్థులు ఎస్‌ఈసీకి అందించిన ఆధారాలను, వీడియోలను పరిశీలించి.. పిటిషనర్ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఎస్‌ఈసీ భావిస్తే తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించింది. ఈక్రమంలో.. నామినేషన్ తేదీని పొడిగించాలని వైసీపీ ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలించాలని ఏపీ ఎస్‌ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్‌కు ధర్మాసనం సూచించింది. గడువును ఒక్క రోజు పొడిగిస్తే ఏమవుతుందని జస్టిస్ బాగ్చీ అనగా.. ఎన్నికల నిర్వహణ పూర్తిస్థాయిలో ఎస్‌ఈసీ పరిధిలోని అంశమని, ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులూ (మాండమస్) జారీ చేయవద్దని పరమేశ్వర్ కోరారు. తాము ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వడం లేదని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం తమ ఉద్దేశం కాదని జస్టిస్ బాగ్చీ స్పష్టం చేశారు.
అయితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన విషయాన్ని ఎస్‌ఈసీ కూడా గుర్తించి భద్రత పెంచిన నివేదికలను ఆయన ప్రస్తావించారు. ‘వైసీపీ వారు 16వ తేదీనే విన్నవించారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ వచ్చిన 14వ తేదీ నుంచి ఆరు రోజుల వరకు పొడిగించే వెసులుబాటు ఉంది. అంటే కనీసం 20వ తేదీ వరకు సులభంగా గడువు ఇచ్చి ఉండవచ్చు కదా’ అని ప్రశ్నించారు. పరమేశ్వర్ స్పందిస్తూ.. హింస జరిగే అవకాశమున్న చోట (మైదుకూరు మున్సిపాలిటీలో)ఎ్‌సఈసీ స్వయంగా ఎన్నికలను నిలిపివేసిందని గుర్తుచేశారు. వైసీపీ ఈ నెల 10న పిటిషన్ వేసి.. 13 వరకు దానిని ముందుకు తీసుకెళ్లలేదని, 15న విచారణకు వచ్చినప్పుడు కూడా గడువు పెంపు కోరలేదని తెలిపారు.
ధర్మాసనం ఏమందంటే..
‘సీనియర్ న్యాయవాదుల వాదనలు విన్నాం. ఆర్టికల్ 243 (జడ్‌ఏ) ప్రకారం మున్సిపల్ ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడం, పర్యవేక్షించడం రాష్ట్ర ఎన్నికల సంఘ రాజ్యాంగ బాధ్యత. ఎన్నికల వ్యవహారాల్లో న్యాయ సమీక్ష పరిధికి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. విస్తృత హింసాకాండ కారణంగా శాంతిభద్రతలు దెబ్బతిని, అందరికీ సమానావకాశాలు లభించకుండా ఎన్నికల సంఘం తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు కోర్టులు మౌనంగా ఉండలేవు.
ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ పర్యవేక్షణలో ఉండే ఎన్నికల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మధ్యంతర జోక్యాలకు కోర్టులు దూరంగా ఉండాలనే సూత్రం తెరపైకి వచ్చింది. సహేతుక కారణం లేకుండా... ప్రభుత్వ యంత్రాంగం అన్యాయంగా వ్యవహరించినా, లేదా అభ్యర్థులు, పార్టీల మధ్య సమాన అవకాశాల వాతావరణాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినా కోర్టులు చూస్తూ ఊరుకోలేవు. కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడమే ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధ పాలనకు ప్రాణవాయువని పేర్కొంటూ... ‘బీజేపీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం’ కేసులో సప్రీరం తీర్పు ఇచ్చింది’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో వివరించింది.
వైసీపీనే అల్లర్లకు పాల్పడింది: ప్రభుత్వం
వైసీపీయే స్వయంగా అల్లర్లకు పాల్పడిందని లూథ్రా అన్నారు. గొడవలు సృష్టించి ఎన్నికల ప్రక్రియను చెడగొట్టడానికి పంజాబ్ నుంచి మనుషులను రప్పించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మరో సీనియర్ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు ఎన్నికలపై ఆసక్తి లేదని, కేవలం మీడియా హైప్ కోసమే ఇదంతా చేస్తున్నారని తెలిపారు. దీనిపై మణీందర్‌సింగ్ స్పందిస్తూ.. నామినేషన్ పత్రాలను చింపివేస్తున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయన్నారు. నోటిఫికేషన్‌కు ముందే హింస జరుగుతుందనే అనుమానాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని అన్నారు. దాదాపు గంటన్నరపాటు వాదోపవాదనల అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వార్తలనూ చదవండి..