Share News

ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండానే కోర్టుకొస్తారా?

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:41 AM

ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండా ఆ ఉద్యోగ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేసిన పిటిషనర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండానే కోర్టుకొస్తారా?

  • ఎస్వీయూ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేసిన పిటిషనర్‌పై సుప్రీం అసహనం

న్యూఢిల్లీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండా ఆ ఉద్యోగ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేసిన పిటిషనర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారికి దరఖాస్తు కూడా ఇవ్వకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల భర్తీ కోసం ఈ ఏడాది మే 15న రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఆ నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ ఓ ప్రైవేట్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జీ.శ్యాంప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఉద్యోగ నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తుల గడువు జూన్‌లోనే ముగిసింది. శ్యాంప్రసాద్‌ సెప్టెంబరు 1న నేరుగా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పైగా పిటిషనర్‌ ఓసీ(అన్‌రిజర్వ్‌డ్‌) కేటగిరీకి చెందినవారు కావడం, ఆ పోస్టులకు అసలు దరఖాస్తు చేయకపోవడంతో.. ఈ వ్యవహారంలో ఆయనకు పిటిషన్‌ వేసే అర్హత(లోకస్‌ స్టాండీ) లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును శ్యాంప్రసాద్‌ గతనెల 10న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది దేవి వెంకట శ్రీకర్‌ వాదనలు వినిపించారు. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని ఆశించడంలేదని, కేవలం చట్టంలోని నిబంధనలను సవాల్‌ చేస్తున్నామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఉద్యోగానికి దరఖాస్తే చేయనప్పుడు ఆ నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించింది. నిబంధనల వల్ల దరఖాస్తు చేసుకోలేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తే సమంజసమని పేర్కొంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 12:41 AM