Share News

పంచాయతీల్లో ప్రత్యేక సిబ్బంది

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:50 AM

గ్రామ పంచాయతీల్లో సిబ్బంది కొరతకు పరిష్కారం చూపే దిశగా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా పంచాయతీల్లో పెరుగుతున్న ఆర్థిక, పరిపాలనా బాధ్యతలకు అనుగుణంగా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించింది.

పంచాయతీల్లో ప్రత్యేక సిబ్బంది

  • పెరుగుతున్న బాధ్యతలకు అనుగుణంగా నియామకం ..

  • జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కేటాయింపు

  • ప్రతి గ్రామ పంచాయతీకి పూర్తిస్థాయి కార్యదర్శి తప్పనిసరి

  • జనాభా ప్రాతిపదికన ఐదు కేటగిరీలుగా పంచాయతీల విభజన

  • దాని ఆధారంగా మానవ వనరుల నమూనాలు రూపకల్పన

  • అత్యధికంగా రూర్బన్‌లో 11 నుంచి 12 మంది సిబ్బంది

  • కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిటీ కీలక ప్రతిపాదనలు

  • రాష్ట్రంలో పంచాయతీల గ్రేడింగ్‌, సిబ్బంది విధానానికి ప్రశంసలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీల్లో సిబ్బంది కొరతకు పరిష్కారం చూపే దిశగా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా పంచాయతీల్లో పెరుగుతున్న ఆర్థిక, పరిపాలనా బాధ్యతలకు అనుగుణంగా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించింది. దేశంలో ప్రతి పంచాయతీకి పూర్తిస్థాయి కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలని సిఫారసు చేసింది. పంచాయతీల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న సిబ్బంది వ్యవస్థ, వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, గ్రామ పంచాయతీలకు సరైన మానవ వనరుల వ్యవస్థను సూచించేందుకు ఈ ఏడాది జూన్‌ 18న ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అనేక పంచాయతీలకు పూర్తిస్థాయి కార్యదర్శులు లేరని, పలుచోట్ల ఒకే కార్యదర్శి ఒకటి కంటే ఎక్కువ పంచాయతీల బాధ్యతలు నిర్వహిస్తున్నారని కమిటీ గుర్తించింది. ఇంజనీరింగ్‌, అకౌంట్స్‌, డిజిటల్‌ గవర్నెన్స్‌, పన్నుల వసూళ్లు, పారిశుధ్యం వంటి విభాగాల్లో సిబ్బంది కొరత ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సిబ్బంది నియామకానికి సంబంధించి కమిటీ పలు సిఫారసులు చేసింది.


సిబ్బంది నియామకాలు ఇలా...

పంచాయతీలను ఐదు కేటగిరీలుగా విభజించి, మానవ వనరుల నమూనాలను రూపొందించాలని కమిటీ సూచించింది. 2,500 మంది లోపు జనాభా కలిగిన వాటిని చిన్న పంచాయతీలు, 2,500- 5,000 జనాభా ఉంటే మధ్యస్థ పంచాయతీలు, 5వేలకు పైగా జనాభా ఉంటే పెద్ద పంచాయతీలు, సెన్సస్‌ టౌన్లు, పట్టణాలకు ఆనుకుని ఉన్న పంచాయతీలు, మండల కేంద్రాలు, అధిక ఓఎస్సార్‌ ఉన్న పంచాయతీలను రూర్బన్‌ గాను, గిరిజన, పీసా, కొండ, సుదూర, సరిహద్దు, క్లిష్ట ప్రాంతాలు కలిగిన పంచాయతీలను ప్రత్యేక కేటగిరీలుగా గుర్తించారు. జనాభాను ప్రాథమిక ప్రమాణంగా తీసుకున్నప్పటికీ పట్టణీకరణ, సొంత ఆదాయం, భౌగోళిక పరిస్థితులు, సేవల అవసరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ పేర్కొంది. చిన్న పంచాయతీల్లో (కేటగిరీ-1) నలుగురి నుంచి ఐదుగురు, మధ్యస్థ పంచాయతీల్లో (కేటగిరీ-2) ఏడు నుంచి ఎనిమిది మంది, పెద్ద పంచాయతీల్లో (కేటగిరీ-3) తొమ్మిది నుంచి పది మంది, రూర్బన్‌ పంచాయతీల్లో (కేటగిరీ-4) 11 నుంచి 12 మంది, కేటగిరీ-5లో ఐదుగురి నుంచి ఆరుగురు కోర్‌ సిబ్బంది ఉండాలని సూచించింది. అయితే స్థానిక అవసరాలు, రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పంచాయతీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌తో పాటు అసిస్టెంట్‌ సెక్రటరీ, అకౌంటెంట్‌- కమ్‌- డిజిటల్‌ అసిస్టెంట్‌, రెవెన్యూ/ట్యాక్స్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, రోజ్‌గార్‌ సేవక్‌, కార్యాలయ సహాయకుడు, పంపు ఆపరేటర్‌, పారిశుధ్య సిబ్బంది వంటి పోస్టులను కమిటీ ప్రతిపాదించింది. ప్రతి పంచాయతీలోనూ అన్ని పోస్టులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా... ఇంజనీరింగ్‌, అకౌంట్స్‌ వంటి సాంకేతిక, ప్రత్యేక సిబ్బంది అవసరాన్ని బట్టి క్లస్టర్‌ ప్రాతిపదికన అందుబాటులో ఉండవచ్చని తెలిపింది.


ఏపీ మోడల్‌కు ప్రత్యేక గుర్తింపు

రాష్ట్రంలో అమలవుతున్న పంచాయతీల గ్రేడింగ్‌, సిబ్బంది విధానాన్ని కేంద్ర కమిటీ తన నివేదికలో ప్రశంసించింది. ఇక్కడ క్లస్టర్‌ ఆధారిత విధానం నుంచి స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మార్పులు చేపట్టినట్లు పేర్కొంది. ఐదు కార్యదర్శి గ్రేడ్లను మూడు పీడీవో గ్రేడ్లుగా హేతుబద్ధీకరించడంతో పాటు రూర్బన్‌ పీడీవో కేడర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది మొత్తం 13,351 గ్రామ పంచాయతీల్లో 359 రూర్బన్‌, గ్రేడ్‌-1 పంచాయతీలుగా 3,082, గ్రేడ్‌-2 కింద 3,163, గ్రేడ్‌-3 పంచాయతీలుగా 6,747 విభజించారు. ఏపీలోని గ్రామ పంచాయతీల వర్గీకరణకు ప్రధానంగా జనాభా, భౌగోళిక పరిస్థితులు- మైదానం/గిరిజన ప్రాంతం, పంచాయతీ ఆదాయం, మండల కేంద్రానికి సమీపం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. 10వేలకు పైగా జనాభా లేదా రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న మైదాన ప్రాంత పంచాయతీలను రూర్బన్‌ కేటగిరీలో చేర్చారు. మండల కేంద్రాలు, అధిక జనాభా/ ఆదాయం ఉన్న పంచాయతీలకు అధిక గ్రేడ్‌ కేటాయించే విధానం అమల్లో ఉంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక జనాభా ప్రమాణాలను నిర్దేశించారు.

పారిశుధ్యానికి ప్రత్యేక సిబ్బంది

ప్రతి పంచాయతీలో రోజువారీ పారిశుధ్య కార్యకలాపాలను నిర్వహించే సిబ్బంది ఉండాలని కమిటీ స్పష్టం చేసింది. తాగునీటి సరఫరా, దానికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ సిబ్బందిని కూడా నియమించాలని పేర్కొంది. కోర్‌ సిబ్బందికి అదనంగా తమ అవసరాలకు అను గుణంగా పంచాయతీలు మరి కొందరిని నియమించుకునే అవకాశం కల్పించాలని సూచించింది. ఇందు కయ్యే వ్యయాన్ని పంచాయతీ సొంత ఆదాయం నుంచి భరించవచ్చని తెలిపింది. పన్నుల వసూళ్లు, ఆస్తుల నిర్వహణ, డిజిటల్‌ రికార్డులు, ఆన్‌లైన్‌ రెవెన్యూ నిర్వహణ, ఆర్థిక నివేదికలు వంటి అంశాలను బలోపేతం చేయాలని కమిటీ సిఫారసు చేసింది.


ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 06:50 AM