Share News

శ్రీకాళహస్తి‌లో గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:02 PM

తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా.. విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు అక్కుర్తి రైల్వే గేటు వద్ద దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

శ్రీకాళహస్తి‌లో గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
Ganja Seizure

తిరుపతి, నవంబర్ 11: జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాంతంలో గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కుర్తి రైల్వే గేటు సమీపంలో తనిఖీలు నిర్వహించి.. అనుమానాస్పదంగా ఉన్న బర్రి మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి అక్రమంగా విక్రయించేందుకు తీసుకొచ్చిన 1,100 గ్రాముల గంజాయితో పాటు ఒక బైక్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని విచారించగా, ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. గంజాయి అక్రమ రవాణా, విక్రయాల వెనుక మరెవరైనా ఉన్నారా? ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి నిల్వలు.. అక్రమ విక్రయాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సహకరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో నవజాత శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా వైద్యులకు ప్రత్యేక శిక్షణ

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 11 , 2026 | 06:10 PM