ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలు!
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:35 PM
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని ఊరి నుంచి సామాజిక బహిష్కరణ చేశారు. ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దని, వారిని పనులకు, శుభకార్యాలకు పిలవకూడదని దండోరా వేయించారు.
శ్రీకాకుళం జిల్లా, మార్చి 23: ప్రపంచం అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక కాలంలోనూ అనాగరికం రాజ్యమేలుతోంది అనడానికి ఈ ఘటన నిదర్శనం. భూ రికార్డ్ రెవెన్యూలో తారుమారు చేస్తున్నారనే ఆరోపణలతో ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు. రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సామాజిక బహిష్కరణ(social boycott) ఘటన స్థానికంగా కలకలం రేపింది. భూ సంబంధిత విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తున్నట్లు గ్రామపెద్దలు, ప్రజలు ప్రకటించారు. కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామస్థులు తీర్మానించారు.
ఆ కుటుంబాన్ని కొండములగాం గ్రామంలో పనులకు, శుభకార్యక్రమాలకు పిలకూడదని దండోరా వేయించారు. సదరు కుటుంబం భూ రికార్డ్ రెవెన్యూలో( land record manipulation) తారుమారు చేయటం, ఎన్నిసార్లు గ్రామ పెద్దలు చెప్పినా.. పెడచెవిన పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు విచారణ చేపట్టారు. సామాజిక బహిష్కరణ నేరమని అధికారులు తెలిపారు. అలానే ఇలాంటి చట్ట వ్యతిరేక పనుల నిర్మూలనపై గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలింగించకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌తో పరిశ్రమల హబ్‌గా విశాఖ ప్రాంతం: మంత్రి అనగాని
విజయవాడలో తక్కువ ధరకే బంగారం పేరిట మోసం.. నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్