Gunda Appala Suryanarayana: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ హఠాన్మరణం
ABN , Publish Date - Jan 12 , 2026 | 08:04 PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఈ సాయంత్రం కన్నుమూశారు. తన నివాసంలో బాత్‌రూమ్‌లో కాలు జారి పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అరసవల్లి, జనవరి 12: శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ (78) ఈ సాయంత్రం (సోమవారం) కన్నుమూశారు. అరసవల్లిలోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో కాలు జారి పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని హుటాహుటిన శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్సపొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
గుండ కుటుంబం శ్రీకాకుళం రాజకీయాల్లో బలమైన పట్టు కలిగి ఉంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుండ అప్పల సూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసిన ఆయన.. టీడీపీతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి 2014లో శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, గాయాల తీవ్రత కారణంగా చికిత్స ఫలించలేదు. మరికాసేపట్లో అరసవల్లిలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించనున్నారు.
టీడీపీ నాయకత్వం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీలు సీనియర్ రాజకీయ నేత మృతికి సంతాపం తెలుపుతున్నారు. గుండ అప్పల సూర్యనారాయణ .. శ్రీకాకుళం ప్రాంత అభివృద్ధికి, బీసీ సమాజ ఉద్ధరణలో కీలక పాత్ర పోషించారు.

చంద్రబాబు సంతాపం:
'మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ గారి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన వరుసగా నాలుగు సార్లు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు రెండుసార్లు మంత్రిగా పని చేశారు. క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.' అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.
ఇవీ చదవండి:
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఓ కీలక అప్‌డేట్! నేటి నుంచీ..
సామాన్యులకే వందేభారత్ స్లీపర్.. వీఐపీ కోటాకు నో ఛాన్స్!