Share News

జడ్పీ, మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులు

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:53 AM

రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారుల నియామకంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, ఎన్నికైన సభ్యుల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది.

జడ్పీ, మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులు

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారుల నియామకంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, ఎన్నికైన సభ్యుల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. అ నేపథ్యంలో ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం-1994లోని సెక్షన్‌ 250-ఏ(1) ప్రకారం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కలెక్టర్‌ను సంబంధిత జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ నియామకం ఈ నెల 25 నుంచి ఆర్నెల్ల పాటు అమల్లో ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలోని మండల పరిషత్‌ పాలనకు కూడా ప్రత్యేకాధికారుల నియామకంపై ప్రభుత్వం మరో జారీచేసింది. ఈ నెల 23తో మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యుల పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

జిల్లాస్థాయి అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, ఇతర జిల్లాస్థాయి అధికారుల్లో నుంచి ప్రత్యేక అధికారులను ఎంపిక చేయవచ్చు. అయితే ఇంజనీరింగ్‌ అధికారులకు మినహాయింపు ఇచ్చారు. ఎంపిక చేసే అధికారి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కంటే కనీసం ఒక హోదా పైస్థాయిలో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా, మండల స్థాయిల్లోని ఈ ప్రత్యేకాధికారులు ఆర్నెల్ల పాటు బాధ్యతల్లో ఉంటారని పేర్కొంది. కొత్త జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగి, కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టే తేదీ ముందుగా వస్తే అప్పటితో ప్రత్యేకాధికారుల పదవీ కాలం ముగస్తుంది. అంటే అంటే ఆర్నెల్లు లేదా కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టే తేదీ ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. ఈ నెల 23 తర్వాత కూడా ప్రస్తుత పాలకవర్గాలు పదవీకాలం ముగియనున్న మండల ప్రజాపరిషత్‌లు ఏవైనా ఉంటే, వాటికి కూడా సంబంధిత జిల్లా కలెక్టర్‌ ఇదే విధానంలో ప్రత్యేక అధికారులను నియమించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 04:53 AM